సీఎం పదవిచ్చినా వైసీపీలో చేరను, నమ్మకద్రోహం చేశారు: మైసూరా సంచలనం

First Published Jun 18, 2018, 11:29 AM IST
Highlights

వైసీపీపై మైసూరా హట్ కామెంట్స్


హైదరాబాద్:వైసీపీలో చేరి చాలా తప్పు చేశానని, సీఎం పదవి ఇస్తానని చెప్పినా తాను భవిష్యత్తులో ఆ పార్టీలో చేరబోనని మాజీ మంత్రి  ఎంవీ మైసూరారెడ్డి చెప్పారు. వైసీపీలో చేరాలని తాను అనుకోలేదన్నారు. అనుకోకుండానే ఆ పార్టీలో చేరాల్సి వచ్చిందన్నారు. కానీ, ఆ పార్టీలో తనకు నమ్మకద్రోహం చేస్తున్నారని భావించి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పినట్టు ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తనతో సంప్రదింపులు చేశారని, కానీ, తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే రాజకీయాల నుండి తాను రిటైర్మెంట్ తీసుకోలేదని స్పష్టం చేశారు మైసూరారెడ్డి.

ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి  పలు అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.  రాజకీయాల నుండి తాను రిటైర్మెంట్ తీసుకొన్నట్టుగా ప్రకటించలేదన్నారు. రాజకీయాల్లో తాను సీఎం పదవి చేయాలనే కోరిక తనకు లేదన్నారు.

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం ప్రతిపక్షంలో ఉన్నానని మైసూరారెడ్డి చెప్పారు. 1989 నుండి 1994 వరకు మాత్రమే అధికారంలో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టిడిపిలో ఉన్న కాలంలో ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ఆ పార్టీలో ఉన్నానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కూడ ఉన్న కాలంలో 1989లో మినహ ఇతర సమయంలో కూడ ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.


వైసీపీలో చేరాలని తాను  అనుకోలేదన్నారు. అనుకోకుండా  ఆ రోజు జగన్ ను కలిశానని ఆయన చెప్పారు. వైసీపీలో చేరినట్టుగా చెప్పారు. అయితే ఆ పార్టీలో సర్ధుకొందామని భావించినట్టు చెప్పారు. అయితే తాను భావించినట్టుగా ఆ పార్టీలో పరిణామాలు తనకు వ్యతిరేకంగా జరిగాయని ఆయన గుర్తు చేసుకొన్నారు. సీనియర్ నాయకుల విషయంలో కూడ జగన్ స్వంత నిర్ణయాలు తీసుకొన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

తనకు నమ్మకద్రోహం చేసే పరిస్థితులు కన్పించడంతో తాను వైసీపీకి దూరం కావాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అంతేకాదు  వైసీపీ నేతలు తనతో వచ్చి సీఎం పదవితో పాటు నిలువెత్తు బంగారం ఇస్తామని తనకు ఆఫర్ ఇచ్చినా భవిష్యత్తులో ఆ పార్టీలో చేరే ప్రసక్తే లేదని ఎంవీ మైసూరారెడ్డి చెప్పారు.

కాంగ్రెస్ పార్టీతో తాను ఏనాడు విబేధించలేదని మైసూరారెడ్డి చెప్పారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డితో విబేధించి ఆ పార్టీకి దూరం కావాల్సి వచ్చిందన్నారు.వైఎస్ తో తాను చెప్పిన ప్రతిపాదనను ఒప్పుకోలేదని చెప్పారు. దరిమిలా తాను టిడిపిలో చేరాల్సిన పరిస్థితులు ఆనాడు నెలకొన్నాయని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

రాయలసీమ విషయంలో అన్యాయం జరుగుతోందని ఈ ప్రాంత ప్రజలకు ఒక అభిప్రాయం ఉందన్నారు. ఈ విషయమై పోరాటం చేసేవారికి తాను మద్దతిస్తానని ఆయన చెప్పారు. గతంలో కూడ ఈ విషయమై తాను చేసిన పోరాటాన్ని ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర విభజన సమయంలో కూడ శ్రీకృష్ణ కమిటికి తాను ఇదే విషయాన్ని రిపోర్ట్ రూపంలో ఇచ్చినట్టు ఆయన చెప్పారు.

సమైకాంద్రగానే కొనసాగించాలని కోరామన్నారు. తెలంగాణతో  రాయలసీమను కలపాలని కూడ ఆ నివేదికలో పేర్కొన్నట్టు చెప్పారు. మరోవైపు నెల్లూరు జిల్లాను కూడ కలుపుకొని గ్రేటర్ రాయలసీమగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణ కమిటికి నివేదిక ఇచ్చినట్టు ఆయన చెప్పారు.

పాదయాత్రల ద్వారా సీఎం పదవి వస్తోందని చెప్పలేనని ఎంవీ మైసూరారెడ్డి చెప్పారు. గతంలో కూడ రాయలసీమ హక్కుల కోసం తాము పాదయాత్రలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏపీలో రెండు పార్టీల మధ్య రెండు లేదా మూడు శాతం ఓట్ల తేడా మాత్రమే ఉందన్నారు. 

అయితే రానున్న ఎన్నికల్లో కొత్త పార్టీ కూడ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.  కాపు సామాజిక వర్గానికి ఏపీ రాష్ట్రంలో సుమారు 23 శాతం ఓటింగ్ ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే తాను కులాల ప్రస్తావన చేయడం లేదని చెబుతూనే  రాజకీయంగా చోటు చేసుకొనే మార్పులపై తన అవగాహనను చెబుతున్నట్టు ఆయన ప్రకటించారు.అయితే దేశంలో కూడ రాజకీయ వాతావరణంలో మార్పులు వస్తున్నాయని ఆయన చెప్పారు. వాటి ప్రభావం కూడ రాష్ట్ర రాజకీయాలపై ఉంటుందన్నారు.


చంద్రబాబునాయుడు కూడ వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అనుకూలంగా వ్యూహ రచన చేస్తున్నారని ఆయన చెప్పారు. జగన్ కూడ  అధికారంలోకి రావాలని ప్రయత్నంలో ఉన్నట్టు కన్పిస్తోందన్నారు.

click me!