పుట్టపర్తికి జేసీ ప్రభాకర్ రెడ్డి రాకను వ్యతిరేకించిన పల్లె వర్గం: మరూర్‌లోనే నిలిపివేసిన పోలీసులు

By narsimha lodeFirst Published May 13, 2022, 3:34 PM IST
Highlights

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పుట్టపర్తికి రాకుండా పోలీసులు నిలువరించారు. మరూర్ టోల్ గేట్ వద్దే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్నారు. పుట్టపర్తికి జేసీ ప్రభాకర్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వర్గీయులు ఆందోళనకు సిద్దమయ్యారు.

అనంతపురం: Tadipatri  మాజీ ఎమ్మెల్యే JC Prabhakar Reddyని పుట్టపర్తికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. మరో వైపు పుట్టపర్తికి జేసీ ప్రభాకర్ రెడ్డి  రాకను నిరసిస్తూ మాజీ మంత్రి Palle Raghunath Reddy నేతృత్వంలో స్వంత పార్టీ వారే నిరసనకు దిగారు.

Puttaparthiకి సమీపంలోని Marur టోల్ గేట్ వద్ద  జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పుట్టపర్తికి వెళ్లకుండా నిలువరించారు. ఉజ్వల విల్లాల విక్రయాల్లో అవకతవకలు జరిగాయని కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లే సమయంలో  వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

 ఈ విషయమై పోలీసులతో జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగారు. తాను  ఉజ్వల విల్లాల విషయమై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసి వస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.  అయితే పుట్టపర్తిలో TDPకి చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వర్గం జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టపర్తికి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.

 పల్లె రఘునాథ్ రెడ్డి వర్గీయులు భారీగా పుట్టపర్తిలో మోహరించడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని భావించి జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయమై పోలీసులు ఏ రకమైన నోటీసు ఇస్తారనే విషయమై చూసిన తర్వాత స్పందిస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి తరపు న్యాయవాది తెలిపారు.

పుట్టపర్తి టికెట్ పల్లె రఘునాథ్ రెడ్డికి కేటాయిస్తే టీడీపీ ఓడిపోవడం ఖాయమని జేసీ ప్రభాకర్ రెడ్డి  ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అవసరమైతే టీడీపీలో తనతో పాటు అందరినీ మార్చాల్సిన అవసరం ఉందని కోరారు. పాత మొహాలను చూసి కార్యకర్తలు విసిగిపోయారన్నారు. తాడిపత్రిలో సైతం తన కుమారుడు అస్మిత్ రెడ్డి కంటే మంచి వ్యక్తి ఉంటే అతనికే టికెట్ కేటాయించినా తన మద్దతు ఉందన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సైకం శ్రీనివాసరెడ్డిని జేసీ తెరపైకి తెచ్చారు.

జేసీ వ్యాఖ్యలకు మాజీ మంత్రి పల్లె కూడా కౌంటర్ ఇచ్చారు. నోటికి ఇష్టం వచ్చినట్లు అడ్డదిడ్డంగా ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాను వివాద రహితుడని పేర్కొన్నారు. ఇతర నియోజకవర్గాల జోలికి తాను వెళ్లనన్నారు. ఆయన ఒక్కసారే ఎమ్మెల్యేగా గెలిచారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై మండిపడ్డారు.

తాను మూడుసార్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేశానన్నారు. జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలకు అందరికి టికెట్లు ఇవ్వొద్దని జేసీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.  ఏ మాత్రం నియోజకవర్గంలో తెలియని వారు పార్టీ కోసం కష్టపడని వారు, కొత్త మొహాలకు టిక్కెట్లు ఇస్తే ఎలా గెలుస్తారో చెప్పాలన్నారు.

also read:వైఎస్ఆర్ పెంపకం మంచిదే, కానీ...: ఏపీ సీఎం జగన్ పై జేసీ సంచలనం

2014లో టీడీపీలో చేరిన జేసీ కుటుంబం ఎన్నో ఏళ్లుగా  టీడీపీలో ఉన్న తమపై పెత్తనం చెలాయిస్తుందా అంటూ రఘునాథ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ రౌడీ.. ఫ్యాక్షనిస్ట్ అన్నారు. గత 35 ఏళ్లుగా టీడీపీ నేతలపై జేసీ కుటుంబం దాడులు చేసి అక్రమ కేసులతో వేధించిందన్నారు.

అయితే గత నెలలో తాడిపత్రికి వచ్చిన మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశం కావడంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి పల్లె రఘునాథ రెడ్డిపై విమర్శలు చేయడం ప్రారంభించినట్టుగా చెబుతున్నారు.
 

click me!