అమరావతి పోరులో బాగంగా తిరుపతిలో చంద్రబాబు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. పండుగ సీజన్ కావడం వల్ల అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. టీడీపీ నేతలను గృహనిర్బంధం చేశారు.
తిరుపతి: తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన అమరావతి పరిరక్షణ సమితి ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. పండుగ సీజన్ కావడంతో ర్యాలీకి అనుమతి నిరాకరిస్తున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ చెప్పారు.
చంద్రబాబు తిరుపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో పలువురు టీడీపి నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. ఐతేపల్లిలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ లను గృహ నిర్బంధం చేశారు.
undefined
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. రైతుల నిరసనను అడ్డుకోవడానికి భారీగా పోలీసులు మోహరించారు. మందడం, తుళ్లూరు, వెలగపూడిల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు చేపట్టారు.
టెంట్ వేసుకునేందుకు పోలీసులు నిరాకరించడంతో తుళ్లూరు గ్రామంలోని రైతులు ఓ ప్రైవేట్ స్థలంలో బైఠాయించారు. రైతులు కూర్చున్న ప్రైవేట్ స్థలం వద్దకు పోలీసులు రావడంతో వారు గేటుకు తాళం వేశారు. దీంతో రైతులు కూర్చున్న ప్రైవేట్ స్థలంపై పోలీసులు డ్రోన్ లను తిప్పుతున్నారు. రైతుల వివరాలను వాటి సాయంతో కనిపెడుతున్నారు.
వెలగపూడిలో రైతుల రిలే నిరాహార దీక్షలు 25వ రోజుకు చేరుకున్నాయి. టెంటులో దీక్ష చేపట్టేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఓ ఇంటి బయట ఎండలోనే కూర్చున్నారు.