వినాయకచవితికి అనుమతుల్లేవు... కానీ మద్యానికి అనుమతులా..: జీవి ఆంజనేయులు సీరియస్

By Arun Kumar PFirst Published Sep 6, 2021, 12:47 PM IST
Highlights

వినాయకచవితి పండగకు అనుమతివ్వని జగన్ సర్కార్ రాష్ట్రంలో యదేచ్చగా మద్యం అమ్మకాలకు మాత్రం అనుమతులిచ్చిందని టిడిపి మాజీ ఎమ్యెల్యే జివి ఆంజనేయులు మండిపడ్డారు. 

అమరావతి: ప్రభుత్వం వినాయక చవితికి అనుమతి ఇవ్వలేదుగానీ మద్యం యదేచ్ఛగా అమ్ముకునేందుకు అనుమతినిచ్చిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్య నిషేదమంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఈ రెండున్నరేళ్లలో మద్యపాన నిషేదం గురించి ఆలోచించనేలేదని అన్నారు. గతంలో ఉన్న రేట్లను రెట్టింపు, మూడొంతుల పెంచి అమ్ముకుంటూ ఖజానాని నింపుకుంటున్నారని ఆంజనేయులు మండిపడ్డారు. 

''కేవలం ఐదారు రూపాయలకు తయారయ్యే మద్యాన్ని పేదలకు రెండు వందలకు అమ్ముతూ వారి రక్తాన్ని పీలుస్తున్నారు. జే ట్యాక్స్ పేరుతో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని నాణ్యత లేని మద్యాన్ని అమ్ముతూ ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు. ఇలా ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతోంది'' అని ఆంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. 

''ఈ ప్రభుత్వం అవినీతికి పాల్పడి రూ.25 వేల కోట్లు దోపిడీ చేస్తోంది. వైసీపీ నేతల అక్రమ సంపాదన రోజు రోజుకు పెరుగుతోంది. పేదవాడు సంపాదించిన డబ్బంతా మద్యానికే తగలేయాల్సి వస్తోంది. మద్యం ధరలు అధికంగా ఉండటంతో తక్కువ ధరకు దొరికే శానిటేజర్లు, నాటుసారా తాగి అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మద్యపాన నిషేదాన్ని ఎందుకు అమలుచేయలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలి'' అని వైసిపి ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే నిలదీశారు. 

read more  అవ్వాతాతల డబ్బులు కొట్టేసిన పాపం...ఊరికేపోదు జగన్ రెడ్డి: లోకేష్ హెచ్చరిక

''టీచర్లను దుకాణాల వద్ద ఉంచి మద్యాన్ని అమ్మించే దుస్థితికి ప్రభుత్వం దిగజారింది. కరోనాతో ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదుగానీ మద్యం అమ్మకాలు, మద్యం ఆదాయం ఆగకూడదన్నట్లుగా ప్రభుత్వముంది. నాటుసారాతో వందల ప్రాణాలు పోయినా ప్రభుత్వం వారిని ఆదుకోలేదు. పేదవాడి బలహీనతలను అడ్డం పెట్టుకొని లబ్ది పొందుతోంది. మద్యంపై లోన్లు తీసుకోవడం సిగ్గుచేటు. మద్యం బాబులను కూడా తాకట్టు పెట్టే స్థితికి ప్రభుత్వం దిగజారింది'' అని విరుచుకుపడ్డారు.

''మద్యం అమ్మకాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. అలాగే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన అవసరముంది. మద్యపాన నిషేదాన్ని వెంటనే అమలు చేయాలి. లిక్కర్, నాటుసారాని అదుపులో ఉంచాలి. గతంలోలా యాభై, అరవై రూపాయలకు మద్యం రేట్లు తగ్గించి జలగల్లా పేదల రక్తాన్ని పీల్చడం మానాలి. లేకుంటే ప్రజలచే ప్రభుత్వానికి పరాభవం తప్పదు. ప్రజల నుండి తిరుగుబాటు రాక మానదు. ప్రభుత్వానికి ఘోరీ కట్టే రోజులు దగ్గరపడ్డాయి'' అంటూ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
 

click me!