పోలీసే దొంగ... చెయిన్ స్నాచింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ యువ కానిస్టేబుల్

Arun Kumar P   | Asianet News
Published : Mar 31, 2022, 04:01 PM IST
పోలీసే దొంగ... చెయిన్ స్నాచింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ యువ కానిస్టేబుల్

సారాంశం

దొంగలను పట్టుకుని కటకటాల్లోకి తోయాల్సిన వాడే దొంగగా మారి జైలుపాలయ్యాడు. కృష్ణా జిల్లా  కైకలూరులో ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కున్ని పరారవుతున్న రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఓ కానిస్టేబుల్. 

కైకలూరు: శాంతిభద్రతలను కాపాడుతూ నేరస్థుల పాలిట సింహస్వప్నంలా వుండాల్సిన వాడే నేరాలకు పాల్పడుతున్న ఘటన కృష్ణా జిల్లా కైకలూరులో వెలుగుచూసింది. దొంగలను పట్టుకోవాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆర్థిక అవసరాల కోసం దొంగగా మారాడు. వచ్చిన జీతం అప్పులు కట్టడానికే సరిపోవడంతో అతడు దొంగతనాలకు సిద్దమయ్యాడు. కానీ అతడి పాపం పండి తాజాగా ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు దొంగిలించడానికి ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. 

వివరాల్లోకి వెళితే...  పశ్చిమ గోదావరి జిల్లా ఉండి పోలీస్ స్టేషన్ లో సింగిడి సత్యనారాయణ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అయితే అతడు బాగా అప్పులపాలవడంతో ప్రభుత్వం నుండి నెల నెలా వచ్చే జీతం సరిపోకపోవడంతో చట్టాన్ని కాపాడాల్సిన వాడు దొంగగా మారాడు. తాను పనిచేసే పోలీస్ స్టేషన్ పరిధిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఛైన్ స్నాచింగ్ లకు పాల్పడేవాడు. ఈ క్రమంలో దొరికిపోతే ప్రాణాలు తీయడానికి సైతం తెగించి   ఓ చాకును వెంటపెట్టుకునేవాడు.  

నేరస్తులను పట్టుకునే వ‌ృత్తి ముగిసాక నేరస్తుడిగా మారిపోయి కృష్ణా జిల్లా కైకలూరులో దొంగతనానికి యత్నించాడు సత్యనారాయణ. పట్టణంలోని ఓ మార్కెట్ సమీపంలో కిరాణ దుకాణంలో కూర్చున్న మహిళపై అతడి కన్ను పడింది. దొంగతనంలో పార్టర్ గా వున్న బుద్దాల సుభాష్ తో కలిసి ముందే రెక్కీ నిర్వహించిన ఈ దొంగ పోలీస్ చెయిన్ స్నాచింగ్ కు స్కెచ్ వేసాడు.

కిరాణ దుకాణంవద్ద ఎవ్వరూ లేని సమయంలో మహిళ ఒంటరిగా వుండగా చెయిన్ స్నాచింగ్ కు పాల్పడి బైక్ పై పరారయ్యేందుకు ఇద్దరూ యత్నించారు. అయితే స్థానికులు అప్రమత్తమై వీరిని చుట్టుమట్టడంతో దొరికిపోయారు. ఇద్దరు దొంగలను చితకబాదిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ఇద్దరు చెయిన్ స్నాచర్ల వద్ద 1,20,000 విలువైన బంగారు గొలుసులు,  ఓ ద్విచక్రవాహనం, చాకు, పెప్పర్ స్ప్రేను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టే క్రమంలో ఇద్దరి వివరాలను సేకరించగా అందులో ఒకడు పోలీస్ కానిస్టేబుల్ గా కైకలూరు పోలీసులు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అతడు పోలీస్ గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసి ఆశ్చర్చపోయారు. దొంగతనం ఎవరు చేసినా దొంగే కాబట్టి ఈ పోలీస్ దొంగను కూడా చట్టప్రకారమే కోర్టుకు తరలించి శిక్ష పడేలా చూస్తామని కైకలూరు పోలీసులు తెలిపారు. 

మంచి ప్రభుత్వ ఉద్యోగం, పోలీసుగా సమాజంలో మంచి హోదా వున్నా ఈజీ మనీ కోసం దొంగగా మారి కటకటాలపాలయ్యాడు కానిస్టేబుల్ సత్యనారాయణ. కాబట్టి చెడుమార్గాల్లో డబ్బు సంపాదన ఎప్పటికయినా ప్రమాదకమేనని ఈ పోలీస్ దొంగ వ్యవహారం బైటపెట్టింది. 
 

PREV
click me!

Recommended Stories

Hero Ghattamaneni Jayakrishna Speech: జై బాబు.. బాబాయ్ కి నేను పెద్ద ఫ్యాన్ | Asianet News Telugu
Deputy CM Pawan Kalyan: కాకినాడ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం | Asianet Telugu