శ్రీశైలం ఆలయంలో స్కామ్: పోలీసుల చేతికి చిక్కిన 26 మంది నిందితులు

By Siva KodatiFirst Published Jun 2, 2020, 2:30 PM IST
Highlights

శ్రీశైలం ఆలయంలో ఆర్ధిక అవకతవకలకు పాల్పడిన వ్యవహారానికి సంబంధించి 26 మంది ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ముగ్గురు ఆలయ ఉద్యోగులు, 23 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. 

శ్రీశైలం ఆలయంలో ఆర్ధిక అవకతవకలకు పాల్పడిన వ్యవహారానికి సంబంధించి 26 మంది ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ముగ్గురు ఆలయ ఉద్యోగులు, 23 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరి వద్ద నుంచి 33 లక్షల 40 వేల నగదు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై క్రైమ్ నెంబర్ 50,51 అండర్ సెక్షన్ 406,420,409 మరియు ఐటీ యాక్ట్ 34,65,66 క్రింద కేసులు నమోదు చేశారు.

కాగా శ్రీశైల మల్లన్న దర్శనం కోసం రూ. 150 టిక్కెట్ల కొనుగోలులో రూ. 1.80 కోట్లు మాయమైనట్టుగా ఆలయ అధికారులు గుర్తించారు. రూ. 1500 అభిషేకం టిక్కెట్లలో రూ. 50 లక్షలు మాయమయ్యాయి.

భక్తులు ఇచ్చిన విరాళాల్లో సుమారు కోటి రూపాయాలు  అక్రమార్కుల పాలయ్యాయి. అదే విధంగా భక్తులకు ఇచ్చిన అకామిడేషన్లకు సంబంధించి విషయాల్లో కూడ రూ. 50 లక్షలు మాయమయ్యాయి.

Also Read:సాఫ్ట్‌వేర్ మార్చి శ్రీశైలం దేవాలయంలో కోట్లు స్వాహా: ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్న ఈవో

500 టిక్కెట్లు, కంకణాలు, మహా మంగళహారతి టిక్కెట్లలో కూడ రూ. 50 లక్షలు మాయమైనట్టుగా ఈవో తెలిపారు. ఒక్కొక్క అవినీతి బయటపడడంతో ఉద్యోగులు పరస్పరం ఈవోకు ఫిర్యాదు చేశారు. 

ఆలయంలో అవినీతి జరిగిందని ఈవో కేఎస్ రామారావు చెప్పారు. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఆయన ప్రకటించారు. స్వామి వారికి భక్తులు ఇచ్చిన విరాళాలే కాదు టిక్కెట్ల కొనుగోలు ద్వారా వచ్చిన ఆదాయం కూడ అక్రమార్కుల జేబుల్లోకి చేరింది.

లాక్ డౌన్ దెబ్బకు ఆలయానికి భారీగా ఆదాయం తగ్గిపోయింది. ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపుల విషయంలో పాలక మండలి ఇబ్బందులు పడుతోంది. అయితే దేవాలయ ఆదాయాన్ని అక్రమార్కులు తమ జేబుల్లోకి మళ్లించుకొన్న విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఉద్యోగులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో ఈ బండారం బయటపడింది. 

click me!