శ్రీవారి భక్తులకు శుభవార్త: వెంకన్న దర్శనానికి ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్, తొలుత వారికే

By Siva KodatiFirst Published Jun 2, 2020, 2:11 PM IST
Highlights

శ్రీవారి భక్తులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా గత రెండు నెలలుగా భక్తులకు దూరంగా వున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

శ్రీవారి భక్తులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా గత రెండు నెలలుగా భక్తులకు దూరంగా వున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీనిలో భాగంగా టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు సర్కార్ అనుమతించింది. భక్తుల మధ్య 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ మేరకు టీటీడీ కార్యనిర్వహణాధికారికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్ లేఖ రాశారు. ప్రభుత్వ ఆదేశాలతో టీటీడీ దర్శనాలకు సంబంధించి కసరత్తు ప్రారంభించింది.

రెండు నెలలకు పైగా శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతించకపోవడంతో.. టీటీడీ ఆదాయంలో భారీగా కోతపడింది. ఈ నష్టాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలనే దానిపై బోర్డు సైతం సమాలోచనలు చేస్తోంది.

మొదటి మూడు రోజులు టీటీడీ ఉద్యోగులను అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్న బోర్డు.. ఆ తర్వాత 15 రోజుల పాటు స్థానికులను శ్రీవారి దర్శనానికి అనుమతించాలని భావిస్తోంది.

ఇకపై శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వారు ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంత తక్కువ సంఖ్యలో శ్రీవారి దర్శనానికి అనుమతించడం సాధ్యమేనా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 

click me!