
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశంలో వాడీవేడీగా చర్చ జరిగింది. బ్యాక్ వాటర్ సర్వేపై తెలుగు రాష్ట్రాలు తలో మాట చెప్పాయి. పోలవరం ముంపు సర్వే చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే బ్యాక్ వాటర్ ఉమ్మడి సర్వే ఉండదని ఏపీ ఈఎన్సీ అన్నారు. తెలంగాణ అభ్యంతరాలు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. ఏపీ సెక్రటరీ కూడా సర్వేకు ఒప్పుకున్నారని తెలంగాణ ప్రభుత్వం గుర్తుచేసింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్‌పై ఉమ్మడి అధ్యయనం ఏది వుండబోదన్నారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెబితే దానిని పరిశీలిస్తామని మాత్రమే పీపీఏ చెప్పిందన్నారు. కేంద్ర జలశక్తి మంత్రితో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం వుంటుందని చెప్పినట్లు శశిభూషణ్ పేర్కొన్నారు. ఇక భూసేకరణపైనా సమావేశంలో చర్చ జరిగిందని ఆయన చెప్పారు.
పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించాల్సిందిగా కోరుతున్నారని.. నగరంలో ఇందుకు సంబంధించి భవనాన్ని వెతుకుతున్నట్లు శశిభూషణ్ వెల్లడించారు. వర్కింగ్ సీజన్‌లో పనులకు ప్రణాళిక వేసి ఈ సమావేశంలో ఆమోదించామని ఆయన పేర్కొన్నారు. జనవరి నాటికి దిగువ కాఫర్ డ్యాం పనులను పూర్తి చేస్తామని శశిభూషణ్ చెప్పారు. 2023 జూన్ నాటికి ప్రధాన డ్యాం పనులను గ్రౌండ్ లెవల్‌కు తీసుకొస్తామని ఆయన తెలిపారు. అదే ఏడాది డిసెంబర్ నాటికి ప్రధాన డ్యాం గ్యాప్ పనులను పూర్తి చేస్తామన్నారు.
ALso Read:మరోసారి జగన్ పాలనపై హరీశ్ రావు పరోక్ష వ్యాఖ్యలు.. ఈసారి పోలవరం మీద
ఇకపోతే... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన నాలుగు రాష్ట్రాలతో కేంద్ర జలశక్తి శాఖ సెప్టెంబర్ 29న సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్‌పై కేంద్రం అధ్యయనం చేస్తోన్న సంగతి తెలిసిందే. 2019, 2011లలో పోలవరం బ్యాక్ వాటర్‌పై సర్వేలు జరిగాయని కేంద్రం చెబుతోంది. ముంపు ప్రభావంపై ఒడిశా, తెలంగాణ , ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు అపోహలు పడుతున్నాయని కేంద్రం అభిప్రాయపడింది. భద్రాచలానికి ఎలాంటి ముంపు లేదని కేంద్రం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యాక కూడా మూడు రాష్ట్రాల్లో అడుగులో మూడో వంతు ముంపు ప్రభావం కూడా వుండదని కేంద్రం చెప్పింది. ముంపు ప్రభావం లేకుండా కరకట్ట కట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా .. ఒడిషా ప్రజాభిప్రాయ సేకరణకు ముందుకు రాలేదని కేంద్రం వెల్లడించింది.