కర్నూలు పర్యటనకు చంద్రబాబు.. ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం

By Siva KodatiFirst Published Nov 16, 2022, 5:01 PM IST
Highlights

మూడు రోజుల పర్యటన నిమిత్తం తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కర్నూలుకు చేరుకున్నారు. ఆ సందర్భంగా  ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. 
 

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం కర్నూలు జిల్లాకు ఆయన వచ్చారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలోని కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, తదితరులు ఆయనకు స్వాగతం పలికారు,. ఆ తర్వాత రోడ్డు మార్గం మీదుగా కోడుమూరుకు చంద్రబాబు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించారు. నేటి రాత్రికి ఆదోనిలో బస చేయనున్న చంద్రబాబు .. రేపు, ఎల్లుండి కూడా కర్నూలు జిల్లాలోనే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

ఇకపోతే.. నియోజకవర్గాల సమీక్షలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను 126 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో ఆయన మాట్లాడారు. పార్టీ కమిటీలు, మెంబర్‌షిప్ వంటి అంశాలపై చంద్రబాబు ఆరా తీశారు. ఎక్కడా గ్రూపులు కట్టరాదని.. అందరినీ కలుపుకుని వెళ్లాలని ఇన్‌ఛార్జ్‌లకు సూచించారు. వారి పనితీరుపై తర్వాత నివేదిక తెప్పించుకుంటానని చంద్రబాబు తెలిపారు. పనితీరు మెరుగుపరచుకోకపోతే.. అందుకు తగినట్లుగా నిర్ణయాలు వుంటాయని హెచ్చరించారు.

Also REad:జిల్లాల పర్యటనలకు చంద్రబాబు శ్రీకారం.. రేపటి నుంచి కర్నూలు టూర్, 3 రోజులు అక్కడే

నియోజకవర్గాల సమీక్షలో భాగంగా బుధవారం పులివెందుల, వెంకటగిరి, నూజివీడు, తుని, పాడేరు, పాలకొండలకు చెందిన నేతలు, కార్యకర్తలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ తీరుతో ఆయనను ఎన్నుకున్న పులివెందులకు కూడా చెడ్డపేరు వస్తోందన్నారు. తన పాలన, విద్వేష రాజకీయాల కారణంగా సొంత నియోజకవర్గానికి కూడా చెడ్డపేరు తెస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

బాబాయ్ హత్య కేసులో స్వయంగా ముఖ్యమంత్రి జగన్ దోషులను కాపాడటం స్థానిక ప్రజలకు నచ్చడం లేదన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌కు అదే చివరి ఛాన్స్ అవ్వనుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. వైసీపీ పట్ల ప్రజల్లో వున్న వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోవాలని ఆయన టీడీపీ నేతలకు సూచించారు. ప్రజా సమస్యలపై పోరాటం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రజలకు దగ్గరకావాలని చంద్రబాబు సూచించారు. 
 

click me!