
ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్‌లు ఘనస్వాగతం పలికారు. ఈ రోజు రాత్రి ప్రధాని ఈస్ట్రన్ నావల్ కమాండ్‌లోని ఐఎన్‌ఎస్ చోళాలో బస చేయనున్నారు. ఐఎన్‌ఎస్ చోళకు చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ.. ఏపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో విడివిడిగా సమావేశం కానున్నారు. రేపు ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఇక్కడి నుంచే ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అయితే ప్రధాని పాల్గొనే ఈ సభ వేదిక మీద ఉండేందుకు అధికారులు 8 మందికే అవకాశం కల్పించారు.
ALso REad:రేపు విశాఖలో ప్రధాని మోదీ బహిరంగ సభ.. వేదికపైకి 8 మందికి మాత్రమే అనుమతి.. ఎవరెవరికంటే..
సభా వేదికపైకి ప్రధాని మోదీతో పాటు.. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీలు పీవీఎన్ మాధవ్, వాకాటి నారాయణ రెడ్డిలు ఉండనున్నారు. ప్రధాని మోదీ 10.15 నుంచి 11.30 గంటలకు ఇక్కడ ఉండనున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సభకు స్వాగతం పలకనున్నారు. అనంతరం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. వేదికపై రాష్ట్ర ప్రభుత్వం తరపున సత్కరించే కార్యక్రమం కూడా ఉండనుంది. సీఎం జగన్ 7 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ ప్రసంగం దాదాపు 40 నిమిషాలు ఉండనుంది.