రేపు విశాఖలో ప్రధాని మోదీ బహిరంగ సభ.. వేదికపైకి ముగ్గురికి మాత్రమే అనుమతి.. ఎవరెవరికంటే..

By Sumanth KanukulaFirst Published Nov 11, 2022, 5:49 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈరోజు సాయంత్రం ప్రధాని మోదీ విశాఖపట్నం చేరుకుంటారు. రేపు ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. 

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈరోజు సాయంత్రం ప్రధాని మోదీ విశాఖపట్నం చేరుకుంటారు. ఈ రోజు రాత్రి ఆయన ఈస్ట్రన్ నావల్ కమాండ్‌లోని ఐఎన్‌ఎస్ చోళాలో బస చేయనున్నారు. రేపు ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఇక్కడి నుంచే ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు  చేయనున్నారు. అయితే ప్రధాని  పాల్గొనే ఈ సభ వేదిక మీద ఉండేందుకు మరో ముగ్గురికే అవకాశం కల్పించారు. తొలుత 8 మందికి అవకాశం కల్పించినట్టుగా ప్రచారం జరిగిన.. చివరకు మోదీతో పాటు ముగ్గురికే ఆ అవకాశం కల్పించారు.

సభా వేదికపైకి ప్రధాని మోదీతో పాటు.. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,  కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌లు  ఉండనున్నారు. ప్రధాని మోదీ 10.15 నుంచి 11.30 గంటలకు ఇక్కడ ఉండనున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సభకు స్వాగతం పలకనున్నారు. అనంతరం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. వేదికపై రాష్ట్ర ప్రభుత్వం తరపున సత్కరించే కార్యక్రమం కూడా ఉండనుంది. సీఎం జగన్ 7 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు.  ప్రధాని మోదీ ప్రసంగం దాదాపు 40 నిమిషాలు ఉండనుంది. 

ఇక, ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి 7.25 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నంలోని ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుంటారు. విశాఖ చేరుకున్న ప్రధాని మోదీకి సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఈస్ట్రన్ నావల్ కమాండ్‌లోని ఐఎన్‌ఎస్ చోళకు చేరుకుంటారు. బీజేపీ నేతల రోడ్‌షో కూడా ప్రధాని పాల్గొంటారు. ఐఎన్‌ఎస్ చోళకు చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ.. ఏపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో,  జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో విడివిడిగా సమావేశం కానున్నారు. రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి బయలుదేరి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో జరిగే బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 


 

click me!