ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం ప్రధాని మోదీ ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 10.10 గంటల సమయంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ప్రధాని మోదీ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్‌లు స్వాగతం పలకనున్నారు. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో ఇప్పటికే ఎస్పీజీ అధికారులు గన్నవరం విమానాశ్రయాన్ని వారి ఆధీనంలో తీసుకున్నారు. అనుమతి ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు.
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఎంఐ–17 ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకుంటారు. సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ కూడా భీమవరం వెళ్లనున్నారు. అల్లూరి జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవిలతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అల్లూరి కుటుంబ సభ్యులతో మోదీ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. భీమవరం సమీపంలోని పెదఅమిరంలో బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. అనంతరం మోదీ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. భీమవరం పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిసర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.