సోషల్ మీడియాలో పోస్టులు.. టీడీపీ శ్రేణులపై వేధింపులు : డీజీపీకి చంద్రబాబు లేఖ

By Siva KodatiFirst Published Jul 3, 2022, 3:14 PM IST
Highlights

ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం లేఖ రాశారు. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్న వారిని వేధించడం సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమని ఆయన అన్నారు.

సోషల్ మీడియాలో పలు అంశాలపై స్పందిస్తున్న వారిని పోలీసులు వేధిస్తున్నారని టీడీపీ (tdp) , అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఆరోపించారు. వీరిలో తెలుగుదేశం కార్యకర్తలే ఎక్కువగా వున్నారని ఆయన తెలిపారు. దీనిపై ఆదివారం ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డికి లేఖ (dgp rajendranath reddy) రాసిన చంద్రబాబు ఫిర్యాదు చేశారు. గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావులను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. అర్ధరాత్రి పూట ఇంటికొచ్చి, తలుపులు బద్ధలుకొట్టి అరెస్ట్ చేయడం సరికాదని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్న వారిని వేధించడం సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమని ఆయన అన్నారు. దీనికి సంబంధించి సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డీజీపీని కోరారు. 

ఇకపోతే.. ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు శనివారం చంద్రబాబు నాయుడు లేఖ రాసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్​లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో అల్లూరిని చేర్చడం తెలుగుజాతికి గర్వకారణమన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి తెలుగు ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చంద్రబాబు తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. అల్లూరి 125వ జయంతి వేడుకల సందర్భంగా పార్లమెంటులో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌కు చంద్రబాబు లేఖ.. ఎందుకోసమంటే..

గతంలో టీడీపీ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అభ్యర్థన మేరకు అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్​ హాల్లో ఏర్పాటు చేయాలని 13వ లోక్‌సభలోని వాజ్‌పేయి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చంద్రబాబు గుర్తుచేశారు. అయితే ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వాలు మారడంతో అల్లూరి విగ్రహ ఏర్పాటులో జాప్యం జరిగిందన్నారు. ఇప్పటికైనా పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అల్లూరిని సత్కరించుకోవడం అంటే దేశ స్ఫూర్తి, మన గిరిజన జాతులను గౌరవించుకోవడమేనని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే.. ఈ నెల 4వ తేదీన భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేయనున్నారు. అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. భీమవరంలోని ఏఎస్‌ఆర్‌ పార్కులో రూ.30 కోట్ల వ్యయంతో 30 అడుగుల ఎత్తైన అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 

click me!