ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు ప్రధానిమోడీ పర్యటన నేపథ్యంలో పోలీసులు బందోబస్తును కట్టుదిట్టం చేశారు.ప్రధాని టూర్ నేపథ్యంలో లెఫ్ట్ పార్టీలు,కార్మికసంఘాలు ఆందోళనలకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.
విశాఖపట్టణం:ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ,రేపు పర్యటించనున్నారు.దీంతో రెండురాష్ట్రాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాల్లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు.ప్రధాని పర్యటన నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో నిరసనలకు పలు రాజకీయ పార్టీలు ,కార్మిక సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు బందోబస్తును కట్టుదిట్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణానికి ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ రాత్రి ఏడున్నర గంటలకు చేరుకుంటారు.ప్రధానికి స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో సీఎం జగన్ ,గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్,పలువురు మంత్రులు,అధికారులు,వీఐపీలు ఇవాళ సాయంత్రానికి విశాఖపట్టణానికి చేరుకుంటారు. రేపు విశాఖలో సుమారు 9 ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేయనున్నారు. విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని పాల్గొంటారు. విశాఖపట్టణం నుండి ప్రధానమంత్రి తెలంగాణకు రానున్నారు. బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. బేగంపేట నుండి రామగుండం వెళ్తారు ప్రధాని.రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీని ప్రధాని జాతికి అంకితం చేస్తారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరసనలకు పిలుపునిచ్చారు. ప్రధాని పర్యటనను అడ్డుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనలు నిర్వహస్తున్నారు. కార్మికుల ఆందోళనలు 640 రోజులకు చేరుకున్నాయి. స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రధాని పర్యటనకు నిరసనకుగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేయాలని కార్మిక సంఘాల జేఏపీ ప్రకటించింది.
ప్రధాని పర్యటన నేపథ్యంలో త్రివిక్రమ్ వర్మ, విశాల్ గున్నీ, పలు జిల్లాలకు చెందిన ఎస్పీలతో నిన్న పోలీసుఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. వీఐపీ,వీవీఐపీలు విశాఖకు వస్తున్న నేపథ్యంలో ఎలాంటిఅవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో నగరంలో ట్రాపిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. డ్రోన్ల పై నిషేధం విధించారు.
ప్రధాని మోడీపర్యటన నేపథ్యంలో 6700 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.420 ఏఆర్ స్క్వాడ్ లు,600 బాంబు స్క్వాడ్ లు విధుల్లో ఉన్నారు.విశాఖ నగరాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
మరో వైపు తెలంగాణ లో ప్రధాని పర్యటనను అడ్డుకొంటామని సీపీఐ ప్రకటించింది. ప్రధాని పర్యటనపై విద్యార్ధి ఐక్య కార్యాచరణ కమిటీ నిరసనకు పిలుపునిచ్చింది. సింగరేణి కార్మిక సంఘాలు కూడ ప్రధాని పర్యటనపై నిరసనలకు దిగుతున్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే రెండు రాష్ట్రాల్లో బీజేపీ నాయకత్వాలు ప్రధాని మోడీ టూర్ ను విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకొంటున్నాయి.