
Pawan Kalyan: అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ప్రధాని మోడీ సమక్షంలో భావోద్వేగంతో కూడిన ప్రసంగం చేశారు. గత ప్రభుత్వ ఐదేళ్లలో రైతులు ఎదుర్కొన్న అవమానాలు, వేధింపులను ప్రస్తావించారు. అమరావతిని కాపాడేందుకు మహిళలతో పాటు రైతులు చేసిన త్యాగాలను కొనియాడారు. ఆంధ్ర పౌరుషం ఏమిటో దేశానికి చూపించారని అన్నారు.
పవన్ ప్రసంగంలో పహల్గాం ఉగ్రదాడి ప్రస్తావించారు. ఈ ఘటన తన హృదయాన్ని కలిచేసిందన్నారు. దేశంలో తీవ్ర వేదన నెలకొన్న సంక్లిష్ట సమయంలో అమరావతి రైతుల పట్ల మద్దతు వ్యక్తం చేయడానికి ప్రధాని మోడీ రాష్ట్రానికి రావడం గొప్ప విషయమని చెప్పారు. పహల్గామ్ దుర్ఘటన నేపథ్యంలో మోడీ పర్యటన, ఆయన అంకితభావానికి నిదర్శనమని అన్నారు.
అమరావతి పునర్నిర్మాణం కేవలం అభివృద్ధి పరంగానే కాకుండా, సామాజిక న్యాయం, జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తుందని పవన్ స్పష్టం చేశారు. ఇది దేశానికి తలమానికంగా మారే అద్భుత నగరంగా చంద్రబాబు తీర్చిదిద్దుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
పవన్ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రధాని మోడీ వేదికపై నుంచి పవన్‌ను తన వద్దకు పిలిచారు. పవన్‌కు ప్రధాని తన వద్ద ఉన్న చాక్లెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. చిన్న క్షణం సభ మొత్తాన్ని నవ్వుల వెల్లువగా మార్చింది.
మొదట మోడీ, చంద్రబాబు నవ్వుతుండగా, చేతిలో ఉన్న చాక్లెట్‌ను చూసిన పవన్ కూడా నవ్వారు. ఆ తర్వాత ప్రధానికి రెండు చేతులతో నమస్కరించి, నవ్వుతూ తిరిగి తన కుర్చీలో కూర్చున్నారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.