
విశాఖపట్నంలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతుంది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో ప్రధాని మోదీ బహిరంగ సభ ప్రారంభం అయింది. కొద్దిసేపటి క్రితం అక్కడికి చేరుకున్న ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందర్, సీఎం జగన్ స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రోడ్లు, రైల్వే ప్రాజెక్టలు నమునాలను ప్రధాని మోదీ పరిశీలించారు. తర్వాత ప్రధాని మోదీ సభా వేదికపైకి చేరుకున్నారు. సభా వేదికపై ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ కూర్చొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధాని మోదీని సీఎం జగన్ సత్కరించారు.
ఈ సందర్బంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అధ్యక్షతన దేశం అద్భుతంగా అభివృద్ది సాధిస్తోందని చెప్పారు. రైళ్లు ప్లాట్‌ఫామ్‌లు, సౌకర్యాల కల్పన మరింతగా పెరిగిందని చెప్పారు. మోదీ హయాంలో భారత్‌లో అనేక మార్పులు వస్తున్నాయని చెప్పారు. గత 8 ఏళ్లలో రైల్వే రూపురేఖలను మార్చేశారని తెలిపారు. రైల్వే అభివృద్ది పథంలో నడుస్తుందని చెప్పారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ను అత్యాధునికంగా అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. రూ. 460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్‌ను ఆధునీకరణ చేస్తున్నామని తెలిపారు.
అన్ని రైల్వే స్టేషన్లను ప్రపంచస్థాయి సౌకర్యాలతో ఆధునీకరిస్తున్నామని చెప్పారు. మోదీ నాయకత్వంలో వందేభారత్ రైలు కల సాకారమైందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు కూడా వందే భారత్ రైలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.