మోదీ, పవన్ భేటీ : ఇది మన మొదటి సమావేశమే.. ఇకనుంచి తరచూ కలుద్దాం.. జనసే అధినేతతో ప్రధాని..

By SumaBala BukkaFirst Published Nov 12, 2022, 8:14 AM IST
Highlights

శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్న ప్రధాని మోడీ అరగంటపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. ఏపీలో ఏం జరుగుతుందో తనకంతా తెలుసునని తెలిపారు. మళ్లీ మళ్లీ సమావేశం అవుదాం అంటూ పవన్ తో తెలిపారు. 

అమరావతి : ‘ఆంధ్ర ప్రదేశ్ లో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది.  రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక క్రమశిక్షణ లోపించింది. హింసాత్మక దాడులు జరుగుతున్నాయి’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి నివేదించినట్లు తెలిసింది.  పవన్ ఈ విషయాలు వివరిస్తుండగా ప్రధాని మోడీ ఇక్కడి విషయాలన్నీ తనకు తెలుసనని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ‘ఇది మన ప్రాథమిక సమావేశమే. ఇక నుంచి మనం తరచూ కలుస్తూ ఉందాం’  అని కూడా ప్రధాని పవన్ తో అన్నారు. 

శుక్రవారం రాత్రి విశాఖలో దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా పరిణామాలు, ఇక్కడ చోటు చేసుకుంటున్న దారుణాలను పవన్ కళ్యాణ్ ప్రధానికి నివేదించారు. ఆయన ఇవన్నీ సావధానంగా వింటూనే..ఇంకా ఇంకా అని అడుగుతూనే మధ్యలో ఆయన ‘ఐ నో ఎవ్రీథింగ్’, ‘ఐ నో ఇట్ ఆల్సో’ అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. 

వైసీపీ వైఫల్యాలు, అవినీతిపై ‘ఛార్జిషీట్’.. ప్రజా వ్యతిరేక విధానాలపై సంతకాల సేకరణ.. మోదీ దిశానిర్దేశం..

ఎనిమిదేళ్ల తరువాత మొదటిసారి.. 
ప్రధాని మోదీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎనిమిదేళ్ల తర్వాత శుక్రవారమే కలుసుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ శుక్రవారం రాత్రి విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి నోవాటెల్ హోటల్ కు చేరుకున్నారు. తర్వాత కొద్దిసేపటికి ప్రధాని మధురై నుంచి విశాఖ వచ్చారు. తూర్పు నౌకాదళ స్థావరంలోని ఐఎన్ఎస్ చోళ అతిథి గృహానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లు నోవాటెల్ నుంచి అక్కడికి వెళ్లారు. 

నిజానికి ప్రధాని రాగానే బీజేపీ కోర్ కమిటీ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ తో భేటీ అని షెడ్యూల్ లో నిర్ణయించారు. ప్రధాని రాక కాస్త ఆలస్యం కావడంతో బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి కంటే ముందే ఆయన జనసేన అధినేతతో సమావేశమయ్యారు. మొదట పవన్, మనోహర్ ఇద్దరు ప్రధానితో సమావేశం అయ్యారు.  తర్వాత మోడీ, పవన్ కళ్యాణ్ దాదాపు అరగంటపాటు మాట్లాడుకున్నారు.

దాడుల గురించి.. 
రాష్ట్రంలో ఆలయాలపై జరిగిన దాడుల నుంచి తాజాగా ఇవ్వటంలో కక్షపూరిత రాజకీయాలను వరకు అనేక అంశాలను పవన్ కళ్యాణ్  క్లుప్తంగా ప్రధానికి వివరించారు. రామతీర్థం ఆలయం, అంతర్వేది రథం దగ్ధం నాటి పరిస్థితులను నివేదించారు. విశాఖలో పవన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను కూడా వివరించగా మోడీ తనకు అన్నీ తెలుసునని చెప్పారు. భూముల ఆక్రమణ వల్ల  పర్యావరణానికి నష్టం వాటిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్రం వాటిని సద్వినియోగం చేయడం లేదని, పైగా వాటిని ఇతర అవసరాలకు ఇస్తోందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తున్నా.. ఎక్కడా ఆ ప్రస్తావన ఉండడం లేదని తాము పేదల ఇళ్లపై ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నామని కూడా తెలియజేశారు ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే అనైతికంగా వ్యవహరిస్తున్న తీరునూ ప్రస్తావించారు. 

పవన్ మీడియా సమావేశం.. 
ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర భవిష్యత్తుకు మంచి చేస్తుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సమావేశం జరిగింది. ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా రెండు రోజుల కిందట పీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. విశాఖ వచ్చి ప్రధానిని కలవాలని ఆయన కార్యాలయం అధికారులు ఆహ్వానించారు. ఎనిమిదేళ్ల తర్వాత ప్రధాని మోదీని కలిశాను.  ఎప్పుడో 2014లో బిజెపి గెలిచిన తర్వాత ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే ముందు కలిశాను. 

ఆ తర్వాత అనేకసార్లు ఢిల్లీ వెళ్లినా ఎప్పుడు కలిసింది లేదు. ఈ సమావేశం వెనుక ముఖ్య ఉద్దేశం ఉంది. ప్రధాని మోదీ కూడా కలవాలని ఆకాంక్షించారు. ఆంధ్ర ప్రదేశ్ బాగుండాలి, ఏపీ ప్రజలు అభివృద్ధి చెందాలనేదే ఆయన ఆకాంక్ష కూడా.  తెలుగు ప్రజల ఐక్యత వర్ధిల్లాలని ఆయన కోరుకుంటున్నారు. అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు.  నాకు అవగాహన ఉన్నంత మేరకు అన్ని విషయాలు ప్రధానికి తెలియజేశాను. ఈ సమావేశం భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్ కు మంచి రోజులు తీసుకువస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు. 

click me!