జగన్ సర్కార్‌కు షాక్.. ఏపీ కొత్త జిల్లాలపై హైకోర్టులో పిటిషన్, ఆ అధికారం లేదంటూ వాదన

Siva Kodati |  
Published : Mar 13, 2022, 03:48 PM IST
జగన్ సర్కార్‌కు షాక్.. ఏపీ కొత్త జిల్లాలపై హైకోర్టులో పిటిషన్, ఆ అధికారం లేదంటూ వాదన

సారాంశం

ఉగాది నుంచి కొత్త జిల్లాల నుంచి పాలన సాగించాలని  చూస్తోన్న ఏపీ సర్కార్‌కు షాక్ తగిలింది. జిల్లాల విభజన సరిగా లేదంటూ పలువురు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జిల్లాల భౌగోళిక స్వరూపాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వారు చెబుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని 23 జిల్లాలను (ap new districts) విభజిస్తూ .. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేసింది వైఎస్  జగన్ సర్కార్ (ys jagan govt) . ఇప్పటికే ఈ మేరకు కసరత్తు సైతం పూర్తి చేసింది. అయితే మధ్యలో ప్రజల నుంచి అభ్యంతరాలు వచ్చినా అది కూడా సద్దుమణిగింది. దీంతో ఉగాది నుంచి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. అయితే ప్రభుత్వానికి షాకిస్తూ కొత్త జిల్లాలపై పిటిషన్ దాఖలైంది. 

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పటికే వివాదాస్పదం అవుతున్నాయి. జిల్లాలను ఎంపీ నియోజకవర్గాల ప్రాతిపదికగా ఏర్పాటు చేయడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతుండగా.. జిల్లా కేంద్రాల ఎంపిక కూడా వివాదాలకు తావిస్తోంది. అయినా ప్రభుత్వం మాత్రం మొండిగానే అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాల విభజన గతంలో చేపట్టిన ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉందని హైకోర్టులో (ap high court) దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. గుంటూరు జిల్లాకు చెంది దొంతినేని విజయకుమార్‌, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బెజ్జి సిద్ధార్థ, ప్రకాశం జిల్లాకు చెందిన జాగర్లమూడి రామారావు ఈ వాజ్యం దాఖలు చేశారు.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం విభజన చట్టంలో గుర్తించిన జిల్లాల భౌగోళిక స్వరూపాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు వాదిస్తున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాతో పాటు జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం రేపు ఈ వ్యాజ్యంపై విచారణ జరపబోతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్దంగా ఉన్నాయని పిటిషనర్లు ఆరోపించారు. ప్రభుత్వ చర్యలు 1975 అక్టోబరు 18న రాష్ట్రపతి ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని, ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల (స్థానిక క్యాడర్‌ నిర్వహణ, నేరుగా నియామకాల క్రమబద్ధీకరణ) ఉత్తర్వులు-1975ను ఉల్లంఘించేలా ఇవి ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా ఒక యూనిట్‌గా, జోన్‌ ఒక యూనిట్‌గా ఉద్యోగ నియామకాలు, విద్యా సంస్థల్లో సీట్ల కేటాయింపు జరుగుతోందని హైకోర్టు దృష్టికి తెచ్చారు . ఆర్టికల్‌ 371డీ ద్వారా సంక్రమించిన అధికారాలతో ఈ వ్యవస్థను రూపొందించారని, కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల జిల్లాల, జోన్ల భౌగోళిక స్వరూపం మారిపోతుందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సర్వీసులో ఉన్న ఉద్యోగులంతా ఈ ఆదేశాల ప్రకారం ఉద్యోగాల్లో చేరినవారేనని వారు గుర్తుచేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ఆ ఉద్యోగులు తమ స్థానికత పరిధిని కోల్పోతారన్నారు. జిల్లా యూనిట్‌గా ఉద్యోగాల భర్తీ చేపట్టినప్పుడు అందుబాటులో ఉండే విస్తృత పరిధి, అవకాశాలు కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల కుచించుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరి దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో  వేచి చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu