
అమరావతి : అధికార కాపాడుకునేందుకు వైసిపి నాయకులు ఎంతకయినా తెగిస్తారని... అడ్డొస్తే ఎవరినైనా చంపుతారని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తంచేసారు. ప్రస్తుతం జనసేన పార్టీ రోజురోజుకు మరింత బలపడుతుండటంతో ఎక్కడ అధికారం కోల్పోతామోననే భయం వారిలో మొదలయ్యిందని... దీంతో తనను చంపేందుకు సుపారీ గ్యాంగ్ లను రంగంలోకి దింపారంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తనకు ప్రాణహాని వుందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు.
రాజకీయ లబ్లి కోసమే పవన్ కల్యాణ్ తనకు ప్రాణహాని వుందంటూ సొల్లుకబుర్లు చెబుతున్నాడని పేర్ని నాని అన్నారు. ఎవరో సుఫారీ ఇచ్చి చంపడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్న పవన్ ముందు పోలీసులకు చెప్పకుండా ఇలా రాజకీయ వేదికలపై చెప్పడం ఏమిటని అన్నారు. నిజంగానే పవన్ ఎవరివల్ల అయినా ప్రాణహాని వుందంటే అది చంద్రబబు వల్లేనని పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేసారు.
గతంలో స్వయంగా పవన్ కల్యాణే మాజీ మంత్రి లోకేష్ అవినీతిపరుడని ఆరోపించాడని... మరి అతన్ని గుడ్డలు విప్పి కొట్టగలడా? అరాచక పాలన సాగించిన చంద్రబాబును కొట్టగలడా? అని మాజీ మంత్రి నిలదీసారు. ఎన్నికలకు ముందు చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కలిసిపోవడం ఖాయమని... ఒంటరిగా సీఎం జగన్ ను ఎదుర్కోవడం వారివల్ల కాదన్నారు. ఇప్పటికే పవన్ కు కాపులు దూరంగా వుంటున్నారని... చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే పూర్తిగా దూరమవుతారని పేర్ని నాని అన్నారు.
Read More పవన్ ఒక రాజకీయ వ్యభిచారి.. దమ్ముంటే కాకినాడలో పోటీ చేయాలి.. : ద్వారంపూడి సవాలు..
ఇదిలావుంటే పవన్ కల్యాణ్ భద్రతపై మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు. వైసీసీ వారికి అడ్డం వస్తే ఎవరినైనా ఏమైనా చేస్తారు... కాబట్టి ప్రాణహాని ఉందంటున్న పవన్ కల్యాణ్‌కు కేంద్రం భద్రత కల్పించాలని కోరారు. తమతో కలిసి పనిచేస్తుండటం వల్లే పవన్ పై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పవన్ ఎదిగితే వైసీపీ నేతలు తట్టుకుంటారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలది అధికారం కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వం అని అన్నారు. పవన్‌కు భద్రత విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆదినారాయణరెడ్డి కోరారు.