సంక్షేమ పాలనకు పట్టం... ప్రతి ఎన్నికలోనూ వైసీపీదే విజయం: పరిషత్ ఫలితాలపై పెద్దిరెడ్డి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Sep 19, 2021, 7:49 PM IST
Highlights

పరిషత్‌ ఎన్నికల్లో సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టం కట్టారని అన్నారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సీఎం జగన్‌ పాలనకు ఏకపక్షంగా మద్దతు పలికారని మంత్రి అభిప్రాయపడ్డారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను రెండున్నరేళ్లలోనే అమలు చేసి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సాధించని ఘనతను సొంతం చేసుకున్నారని ప్రశంసించారు

పరిషత్‌ ఎన్నికల్లో సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టం కట్టారని అన్నారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సీఎం జగన్‌ పాలనకు ఏకపక్షంగా మద్దతు పలికారని మంత్రి అభిప్రాయపడ్డారు. పరిషత్ ఎన్నికల ఫలితాలపై పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఈ రిజల్ట్స్ టీడీపీతో పాటు ఇతర పార్టీలకు చెంపపెట్టన్నారు. రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ పనిచేసే ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టారని పెద్దిరెడ్డి గుర్తుచేశారు.. గత ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవీ నేరవేర్చలేదని మంత్రి ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను రెండున్నరేళ్లలోనే అమలు చేసి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సాధించని ఘనతను సొంతం చేసుకున్నారని ప్రశంసించారు. జగన్ పరిపాలన ఈ ఎన్నికల్లో ప్రతిబింబించింది అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.  

అంతకుముందు మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే సీఎం జగన్‌ జైత్రయాత్ర కొనసాగుతున్నట్లు అర్థమవుతోందన్నారు . పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి 80 శాతం ఫలితాలు వచ్చాయని.. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ అంతకుమించి ఫలితాలు వస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు ప్రజాబలం ఉందని చెప్పేందుకు ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు.  

ALso Read:ఏపీ స్థానిక సంస్థల ఫలితాలు:జడ్పీఛైర్మెన్, ఎంపీపీ ఎన్నికలకూ టీడీపీ దూరం

2018లోనే పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా చంద్రబాబు పెట్టలేదని కన్నబాబు మండిపడ్డారు. పరిషత్‌ ఎన్నికలు పెట్టాలని చూస్తే చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడ్డారని మంత్రి ఆరోపించారు. కొందరు అడుగడుగునా అడ్డుతగిలినప్పటికీ ప్రజలు సీఎం జగన్ వెంటే నడిచారని ఆయన గుర్తుచేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైకాపా దౌర్జన్యాలు, దుర్మార్గాలకు పాల్పడినట్లు టీడీపీ ప్రచారం చేసిందని.. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా సీఎం జగన్‌కు ప్రజలు వెన్నుదన్నుగా నిలబడ్డారని కన్నబాబు వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయాన్ని చేతల ద్వారా చేసి చూపించిన వ్యక్తి సీఎం జగన్‌ అని ఇప్పటికైనా ఓటమికి కారణాలను తెలుసుకొని.. రాష్ట్ర నిర్మాణాత్మక పరిపాలనకు టీడీపీ సహకరిస్తే మంచిది అని కన్నబాబు హితవు పలికారు.  

click me!