ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తన జట్టును గెలిపించుకున్నారు నారా చంద్రబాబు నాయుడు. అసెంబ్లీ శపథం చేసినట్లే... అనుకున్నది సాధించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పంతం నెగ్గించుకున్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగుపెడతానన్న శపథాన్ని నెరవేర్చుకున్నారు. రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇది తెలుగుదేశం శ్రేణులు, చంద్రబాబు అభిమానులకు ఎంతో ఉద్వేగపూరితమైన సమయంగా చెప్పుకోవచ్చు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 151 సీట్లు వైసీపీ గెలుచుకోగా.. టీడీపీ 23 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సంఖ్యా బలం తక్కువగా ఉన్న టీడీపీని అసెంబ్లీలో వైసీపీ ఆటలాడుకునేది. అధికర పక్ష సభ్యులు చంద్రబాబుపై సెటైర్లు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రసంగాలు చేసేవారు. ఈ క్రమంలో 2021 నవంబర్ 19న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ సభ్యులు అవమానకరంగా మాట్లాడారు. చట్టసభలో చంద్రబాబు సతీమణి పేరుతో అసభ్యకరంగా మాట్లాడారు. దీంతో అప్పుడు సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు దారుణంగా అవమానపడ్డారు. ఆవేశపడ్డారు. కోపోద్రిక్తులయ్యారు. గౌరవప్రదమైన అసెంబ్లీలో ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ అధికార పక్షంపై విరుచుకుపడ్డారు. ఇది గౌరవసభ కాదు.. కౌరవ సభ అంటూ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడుతూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలోకి తిరిగి అడుగుపెడతానని శపథం చేశారు. నాడు అసెంబ్లీని బహిష్కరించి బయటకు వచ్చిన ఆ తర్వాత మళ్లీ తిరిగి అడుగుపెట్టలేదు.
undefined
నారా చంద్రబాబు నాయుడు తెలుగువారికి పరిచయం అవసరం లేని పేరు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు, విభజనం అనంతరం నవ్యాంధ్ర తొలి సీఎంగానూ పనిచేశారు. అలాంటి ఆయన గత (2019) అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో గెలుపోటములు రెండింటినీ చూశారు. కానీ.. గత ప్రభుత్వం మాత్రం ఆయనను చాలా ఇబ్బంది పెట్టింది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆయన పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఇబ్బంది పెట్టినవారే. అసెంబ్లీలో ఆయన భార్య ప్రస్తావన తీసుకువచ్చి కూడా చాలా దారుణంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడూ నిబ్బరంగా ఉండే వ్యక్తి.. వాళ్ల మాటలకు చాలా బాధపడ్డారు. ఏకంగా మీడియా ముందే కన్నీరు పెట్టుకున్నారు. అంతేకాదు.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేశారు.
ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తన జట్టును గెలిపించుకున్నారు నారా చంద్రబాబు నాయుడు. అసెంబ్లీ శపథం చేసినట్లే... అనుకున్నది సాధించారు. ఎన్‌డీయే కూటమిలోని జనసేన, బీజేపీతో కలిసి టీడీపీ ఘన విజయం సాధించేలా చేశారు. టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 135 స్థానాలను గెలుచుకోగా... జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాలను గెలుచుకుంది. ఇక, భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేసి.. 8 స్థానాలను గెలుచుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఘోరంగా విఫలమై 11 స్థానాలకే పరిమితమైంది.
అసెంబ్లీలో చేసిన శపథం నెగ్గించుకున్న చంద్రబాబు... నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా... గత ఐదేళ్లపాటు అడుగడుగునా వేధించిన జగన్ ప్రభుత్వం కూలిపోయింది. దారుణంగా 11 సీట్లకు పరిమితమై.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితికి చేరింది. మరి రానున్న ఐదేళ్లు జగన్, ఆయన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల పరిస్థితి అసెంబ్లీలో ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి.