బట్టలూడదీసి తరిమి తరిమి కొడుతా: పవన్ కల్యాణ్ ఉద్వేగం

First Published May 23, 2018, 9:57 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ధ్వజమెత్తారు.

టెక్కలి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. కిరాయి మూకలు, గూండాలతో దాడికి ప్రయత్నిస్తే బట్టలూడదీసి తరిమితరిమి కొడతామని హెచ్చరించారు. టెక్కలిలో నిరసన కవాతు జరగకుండా లారీలు అడ్డుపెట్టారని ఆయన బుధవారం ఆరోపించారు. 
మంగళవారం రాత్రి పలాసలో తాను బసచేసిన చోట కరెంట్ తీసి కిరాయి మూకలు ద్వారా దాడిచేయాలని చూశాయని ఆయన అన్నారు. తాను అన్నింటికీ తెగించిన వ్యక్తినని, ప్రజాసమస్యలపై పోరాటానికి వచ్చినవాడినని, ఇలాంటి పిచ్చిపిచ్చి పనులకు భయపడేవాడిని కాదని అన్నారు. 

శ్రీకాకుళం సైనికులు పుట్టిన నేల అని, స్వేచ్ఛామాత పుట్టిన నేల అని, భరతమాతకి గుడి ఉన్న ఏకైక నేల అని, దేశంలో ఏ మూలకెళ్లినా ఓ శ్రీకాకుళం సైనికుడు కనపడతాడని, జైహింద్ అంటాడని అన్నారు. వాడికి స్ఫూర్తిగానే ఈ మిలటరీ చొక్కా వేసుకున్నానని చెప్పారు.

"రౌడీలను, గూండాలను పంపిస్తే మేం సైనికులమని గుర్తుపెట్టుకోండి. నిర్ధాక్షణ్యంగా ఉంటాము. కిరాయి గుండాలను బట్టలూడదీసి కొడతాం. వేషాలు వేయొద్దు నా దగ్గర.. మీ గుండాలకి.. కిరాయిమూకలకి... భయపడతామనుకున్నారా.? జాగ్రత్త.. ఖబడ్దార్" అని పవన్ కల్యాణ్ ఉద్వేగంగా అన్నారు.

2014 ఎన్నికల్లో కనీసం కొన్ని స్థానాలకైనా ఎందుకు పోటీ చేయలేదని చాలా బాధపడుతున్నానని అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ ప్రయోజనాల కోసం పని చేస్తానని అన్నారు. ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వనందుకు తమ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. 

కిడ్నీబాధితులకు డయయాలిసిస్‌తో సరిపోదని, అందుకు అవసరమైన డాక్టర్ కావాలని ఆయన అన్నారు. గతంలో కాంగ్రెస్ చేసిన తప్పులను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తోందని ఆయన విమర్శించారు.

click me!