హరీష్ రావు మీద ఏపీ మంత్రులు విరుచుకుపడడాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పు పట్టారు. నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
అమరావతి : వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలంగాణ ప్రజలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. ఇటీవల తెలంగాణ వైద్యారోగ్య శాఖా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల మీద ఏపీ మంత్రులు మూకుమ్మడిగా దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. మాటల యుద్ధం జరుగుతోంది. దీని నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ ఈ మేరకు ఘాటుగా స్పందించారు.
వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. మంత్రి హరీష్ రావు ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో తను తెలియదు కానీ ఏపీ మంత్రులు స్పందించిన తీరు మాత్రం అభ్యంతరకరం అన్నారు. ఒక జాతిని అవమానిస్తుంటే వైసీపీ సీనియర్లు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
కాగా, గతవారం తెలంగాణ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి ఇక్కడి నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వలస కార్మికులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇలా వచ్చిన వలస కార్మికులు తెలంగాణలోనే వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికుల సంక్షేమానికి పాటుపడుతుందని చెప్పారు.
ఆ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని హరీష్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలోని ఆసుపత్రులు, హైదరాబాదే కాకుండా ఇతర ప్రాంతాల్లో రోడ్లు, ఇతర సేవలు, ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయో కూడా మీ అందరికీ బాగా తెలుసు’’ అని కామెంట్ చేశారు.
కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపడుతుందని.. వీటిని వినియోగించుకోవడానికి రెండు రాష్ట్రాల్లో ఓట్లు కాకుండా కేవలం తెలంగాణలోనే ఓటుహక్కు ఉండేలా చూసుకోవాలని వలస కార్మికులకు సూచించారు.
దీనిమీద వివాదం చెలరేగింది. ఏపీ మంత్రులు హరీష్ రావు మీద విరుచుకుపడ్డారు. మంత్రి సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణలు కౌంటర్లతో విరుచుకుపడ్డారు. ఏపీ సమాజం కుటుంబ పాలనను అంగీకరించదంటూ అప్పలరాజు చురకలు వేయగా.. మీ సంగతి మీరు చూసుకోండంటూ బొత్స వ్యంగ్యాస్త్రాలు విసిరారు.