అనంత్ అంబాని, రాధిక మర్చంట్ పెళ్లికి హాజరైన ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను అందరూ ఒక్కటే అడిగారట... అతిథులంతా తనతో ఏం మాట్లాడారో తాజాగా పవన్ బైటపెట్టారు.
Pawan Kalyan : పవన్ కల్యాణ్... సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ పవర్ స్టారే. చాలాకాలం ఆయనకు సినిమాల్లో విజయమే లేదు... కానీ ఓటమిని అంగీకరించని అతడి మొండితనమే గబ్బర్ సింగ్ లాంటి హిట్ ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన పవర్ ఏంటో అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోనూ సేమ్ టు సేమ్ ఇదే జరిగింది. జనసేన పార్టీ పెట్టి పదేళ్లపాటు ఓపికగా రాజకీయాలు చేసారు పవన్... దాని ఫలితమే ఇప్పటి అఖండ విజయం. గతంలో కేవలం ఒకేఒక్క సీటు గెలిచిన జనసేన పార్టీని ఈసారి ఒక్కసీటు కూడా ఓడిపోని స్థాయికి తీసుకువెళ్లారు. ఇది పవన్ కల్యాణ్ తోనే సాధ్యమయ్యింది.
100 శాతం సక్సెస్ రేట్ తో విజయం అంత ఈజీ కాదు... దేశ రాజకీయాల్లో ఎందరో గొప్ప నాయకులను, ఎంతో చరిత్రగల రాజకీయ పార్టీలను చూసాం. కానీ ఎవరికీ ఇది సాధ్యంకాలేదు. కానీ పవన్ కు ట్రెండ్ ఫాలో కాలేదు... సెట్ చేసారు... అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసారు. ఒక్కచోట కూడా ఓడిపోకుండా పోటీచేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో జనసేన విజయం సాధించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పవన్ పేరు మారుమోగింది... జనసేన విజయంపై తీవ్ర చర్చ జరిగింది.
ఇప్పటికీ జనసేన విజయంపై దేశవ్యాప్తంగా టాక్ నడుస్తోందని స్వయంగా పవన్ కల్యాణ్ తెలిపారు. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లికి వెళ్లినపుడు అందరూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అభినందించారని పవన్ తెలిపారు. ఇలా జాతీయ స్థాయిలో తనకు గౌరవం దక్కేందుకు ఈ విజయం ఎంతోో దోహద పడిందని పవన్ పేర్కొన్నారు.
అనంత్, రాధిక పెళ్లిలో పవన్ కల్యాణ్ :
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ సత్కరించారు. మంగళగిరిలోకి జనసేన పార్టీ కార్యాలయంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ జనసేన విజయంపై దేశవ్యాప్తంగా ఎలా చర్చ జరగుతుందో వివరించారు.
ఇటీవల అట్టహాసంగా జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ పెళ్ళికి హాజరైన సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖుల్లో చాలామంది పవన్ తో మాట్లాడారు. అయితే వీరంతా తనతో ఏం మాట్లాడారో తాజాగా పవన్ బైటపెట్టారు.
ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లిలో తనను కలిసిన ప్రతిఒక్కరూ జనసేన విజయం గురించే మాట్లాడారు... ఇంతటి అధ్బుత విజయం ఎలా సాధ్యమయ్యింది? అని అడిగినట్లు తెలిపారు. 100 శాతం స్ట్రయిక్ రేట్ తో విజయం సాధించడం గురించి ప్రస్తావించారు. ఇలా అందరూ అడుగుతుంటే తనకెంతో గొప్పగా అనిపించిందని పవన్ పేర్కొన్నారు.
భారతదేశ రాజకీయ చరిత్రలో జనసేన సాధించిన విజయం రాజకీయ నిఫుణులకు, రాజనీతి శాస్త్ర విభాగానికి ఒక కేస్ స్టడీ అయ్యిందని పవన్ అన్నారు. ఇది కేవలం విజయమే కాదు... ఐదు కోట్ల ఆంధ్రులు జనసేన మీద పెట్టుకున్న నమ్మకం అని గుర్తించాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు పవన్ సూచించారు. ప్రజలు ఇచ్చిన ఈ విజయాన్ని బాధ్యతగా భావించి సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పనిచేయాలని పవన్ సూచించారు.