
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకుడు ఏం చేస్తాడో కింది స్థాయి వ్యక్తులు కూడా అదే చేస్తారని.. వైసీపీ నాయకులు అంతకు మించి చేస్తున్నారని విమర్శించారు. అధికారం ఉందని దౌర్జన్యాలకు పాల్పడితే తీవ్రవాద ఉద్యమాలే వస్తాయని అన్నారు. ఆదివారం విజయవాడలో రెండో విడత జనవాణి - జనసేన భరోసా కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను పవన్ కల్యాణ్ స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని పవన్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరారు.
ప్రజల మాన ప్రాణ, ఆస్తుల జోలికి వస్తే తోలుతీస్తామని అన్నారు. వృద్ధాప్యంలో ఉన్న ఓ తల్లి మీద దౌర్జన్యం చేస్తే ఈ ముఖ్యమంత్రికి తెలియడం లేదా అని ప్రశ్నించారు. చేతులు నిమిరి ముద్దులు పెట్టింది ఇలా ఇళ్ల నుంచి గెంటివేయడానికేనా అంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి అన్యాయాల్ని పది మంది బయటకు వచ్చి చొక్కా పట్టుకుని నిలదీస్తే తప్ప పరిస్థితుల్లో మార్పు రాదని అన్నారు.
ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి గ్రామానికి చెందిన అరుణ అనే మహిళ స్థానిక వైసీపీ ఎంపీటీసీ 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న తన ఇంటిని కట్టా చేసి, దౌర్జన్యానికి పాల్పడిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్.. నాయకుడు ఏం చేస్తే.. కిందున్నవారు అదే చేస్తారని చెప్పారు.
‘‘2004లో అప్పటి ప్రభుత్వం స్థలం ఇస్తే.. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి లోను ఇచ్చింది. దీన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రక్రియలో వీరి పక్కనే ఉన్న వైసీపీ ఎంపీటీసీ మాకు ఆ స్థలం కావాలంటూ దౌర్జన్యానికి పాల్పడి.. ఆడవారు అని కూడా చూడకుండా ఊహించలేనంతగా తిట్టి బెదిరించారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకో పొమ్మన్నారు. కోర్టుకు వెళ్లినా.. ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లినా ఫలితం లేదు. వారు కూడా బాధితుల్ని తప్పుదోవ పట్టించారు. 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారిని బయటికి తోసేశారు. పేదలకు ఇలా జరుగుతుంటే డబ్బున్న వాళ్లు కూడా ఆలోచించాలి. వైసీపీ ప్రభుత్వం గురించి ఎన్నికల ముందే నేను చెప్పాను. నాయకుడు ఏం చేస్తే కిందున్న వారు అదే చేస్తారు. వైసీపీ నాయకులు అంతకు మించి చేస్తున్నారు. రెండున్నర దశాబ్దాల పాటు ఇలాంటి ఎన్నో అంశాలు నన్ను కదిలించాయి. సీపీఎఫ్, జనసేన పార్టీపెట్టడానికి కూడా కారణం అదే. బలమున్నోడు.. బలిసున్నోడు వచ్చి ఉన్న ఇల్లు లాగేసుకుంటే మనం ఎక్కడికి వెళ్తాం. ప్రభుత్వం, పోలీసులు, కోర్టులు సహకరించకపోతే ప్రజలు మాత్రం ఏం చేస్తారు?’’ అని పవన్ అన్నారు.
వైసీపీ ప్రభుత్వం అంటే తనకు చిరాకు అని.. ఎందుకంటే వారు మదంతో కొట్టుకుంటున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ఎవరో ఒక్కరు ఇలా చేస్తే భరించగలమని.. కానీ ప్రతిచోట ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే కనిపించిన కొండనల్లా మింగేస్తారని.. 2019 ఎన్నికల సమయంలో విశాఖ పర్యటనలో తాను చెప్పానని అన్నారు. ‘‘ఓ పెద్ద నిర్మాతను అన్నయ్య గారికి మీ స్టూడియో నచ్చింది ఇచ్చేయమంటున్నారని’’ అని తనకు ఇటీవల తెలిసిందన్నారు.
‘‘ఈ మధ్య నాకు తెలిసిన ఓ పెద్ద స్టూడియో ఓనర్‌తో మాట్లాడితే చెప్పారు. ఎవరో వచ్చి అన్నయ్య గారికి మీ స్టూడియో నచ్చింది తీసుకుంటారంట అని అడిగారంట.. వేరే దారిలేదు అమ్మాల్సిందే అని డిమాండ్ ఒకటి. ఆ స్థాయి వ్యక్తుల నుంచి అట్టడుగు పేదల వరకు అన్యాయం జరుగుతుంటే మనం కలసి ఎదుర్కొనకపోతే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
కరకంబాడి ఇంటి కబ్జా సమస్యను పరిష్కరించాలని హోం మంత్రిని, ఇతర మంత్రులను పవన్ కోరారు. లేదంటే వైసీపీ నాయకులు ప్రజాగ్రహాన్ని తట్టుకోలేరని అన్నారు. ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని అన్నారు. మీరు ఎవరైనా.. జనసేన, జనసైనికులు, వీరమహిళలు భయపడే ప్రసక్తే లేదన్నారు. చిత్తూరు జిల్లా వైసీపీ నాయకులు వారి జోలికి వచ్చి ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తే.. తానే స్వయంగా వస్తానని పవన్ హెచ్చరించారు.