జగన్‌ను అథ:పాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదంటూ జనసేనాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాట్లాడితే నాలుగు పెళ్లిళ్లు అంటాడని.. ఆ నాలుగో పెళ్లాం ఎవరో తనకు తెలియదన్నారు. లేని నాలుగో పెళ్లాం అంటే నువ్వే.. రా జగన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పొత్తులో భాగంగా తాను టీడీపీ నుంచి కేవలం 24 సీట్లు మాత్రమే తీసుకోవడంపై వైసీపీ చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బుధవారం తాడేపల్లిగూడెంలో జరిగిన జనసేన టీడీపీ ‘జెండా’ బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ.. పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లు తీసుకున్నానని , 24 సీట్లేనా అని అవతలిపక్షం విమర్శించిందన్నారు. బలి చక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నారని.. నెత్తిన కాలుపెట్టి తొక్కితే ఎంతో అని తెలిసిందని పవన్ చురకలంటించారు.
జగన్‌ను అథ:పాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదంటూ జనసేనాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలేనని.. ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కడుతున్నానని, కోట కూడా కడతామని, రేపు తాడేపల్లి కోట కూడా బద్ధలు కొడతామన్నారు. తనకు సలహాలు ఇచ్చేవాళ్లు అక్కర్లేదని.. యుద్ధం చేసేవాళ్లు కావాలని పవన్ వ్యాఖ్యానించారు. మాటిమాటికీ జగన్ తన పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారని, కానీ తామెప్పుడూ ఆయన సతీమణి గురించి మాట్లాడలేదని పవన్ తెలిపారు. జగన్ దృష్టిలో పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్లు, రెండు విడాకులు.. మాట్లాడితే నాలుగు పెళ్లిళ్లు అంటాడని.. ఆ నాలుగో పెళ్లాం ఎవరో తనకు తెలియదన్నారు. లేని నాలుగో పెళ్లాం అంటే నువ్వే.. రా జగన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. రాష్ట్రంలో ఏ ఇష్యూ అయినా ఈ ఐదుగురే పంచాయతీ చేస్తున్నారని మండిపడ్డారు. మిగిలిన ఏ నాయకులకు ఎలాంటి అధికారం , హక్కు లేవన్నారు. తాను ఒక్కడినే అంటున్న జగన్.. మా ఒక్క ఎమ్మెల్యేను లాక్కున్నారని , జూబ్లీహిల్స్ ఫాంహౌస్‌లో ఇల్లు కట్టినప్పటి నుంచి జగన్ బతుకేంటో తనకు తెలుసునని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని.. తన నిర్ణయాలు రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని ఆయన అన్నారు.
టీడీపీ జనసేన సహకరించుకుంటేనే ప్రజల భవిష్యత్తు బాగుంటుందని, కోట్లు సంపాదించే స్కిల్స్ వున్నా అన్నీ కాదనుకుని వచ్చానని పవన్ తెలిపారు. సినిమాల్లో వచ్చే డబ్బుతో ఇంట్లో బియ్యం కొనకుండా.. హెలికాఫ్టర్లకు ఖర్చు చేస్తున్నానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఓడినా గెలిచినా తాను మీతోనే వుంటానని.. తన వ్యూహాలను తప్పుపట్టవద్దని సూచించారు. టీడీపీ జనసేన గెలవాలి.. జగన్ పోవాలని , నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.
జగన్ ఇప్పటి వరకు పవన్ తాలుకా శాంతినే చూశారని.. ఇకపై తన యుద్ధం ఏంటో చూస్తావంటూ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్‌తో స్నేహమంటే చచ్చేదాకా.. పవన్ కళ్యాణ్‌తో శత్రుత్వమంటే అవతలివాడు చచ్చేదాకా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ యువ ముఖ్యమంత్రి అంట.. యువతను బొంద పెట్టడానికి తప్ప ఈ యువ ముఖ్యమంత్రి ఎందుకూ పనికిరాలేదని చురకలంటించారు. 2019లోనే జగన్‌కు ఓటేయొద్దని చెప్పానని.. అయినా ప్రజలు వినలేదని పవన్ ఎద్దేవా చేశారు.