వరుసగా ఐదో ఏడాది.. వైఎస్సార్ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. మొత్తంగా రైతు భరోసా, సున్నా వడ్డీ కింద రైతులకు మొత్తం రూ.1294.38 కోట్లు అందించామని జగన్ పేర్కొన్నారు.
వరుసగా ఐదో ఏడాది.. వైఎస్సార్ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఈ మేరకు బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. రబీ 2021-22, ఖరీఫ్ 2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా ముఖ్యమంత్రి చెల్లించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు.
వరుసగా ఐదో ఏడాది రైతు భరోసా అందిస్తున్నామని.. 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.1,078.36 కోట్లు జమ చేశామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కౌలు రైతులు, అటవీ, దేవాదాయ శాఖ భూముల సాగు రైతులకు సాయం చేశామని సీఎం పేర్కొన్నారు. 57 నెలల్లో రైతు భరోసా కింద రూ.34,288 కోట్లు అందించామని.. మిస్ కాకుండా వైఎస్సార్ రైతు భరోసా కింద సహాయాన్ని అందించామని చెప్పారు.
వంద శాతం రైతులకు 80 శాతం ఖర్చు రైతు భరోసా కింద కవర్ అయిందన్నారు. సున్నా వడ్డీ కింద రూ. 215.98 కోట్లు విడుదల చేస్తున్నామని ఇప్పటి వరకు 84.66 లక్షల మంది రైతులకు , రూ 2,050 కోట్లు అందించామన్నారు. మొత్తంగా రైతు భరోసా, సున్నా వడ్డీ కింద రైతులకు మొత్తం రూ.1294.38 కోట్లు అందించామని జగన్ పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఏడాదికి రూ.12,500 బదులు.. రూ.13,500 ఇచ్చామన్నారు. రూ.50 వేల స్థానంలో ఐదేళ్లలో రూ.67,500 ఇచ్చామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
19 లక్షల మంది రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని.. ఉచిత విద్యుత్ కింద రూ.45 వేల కింద మేలు జరుగుతుందన్నారు. ఏడాదికి రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని.. రైతుల తరపున పంటల బీమాకు ప్రీమియం కడుతున్న ఏకైక రాష్ట్రం మనదేనని జగన్ చెప్పారు. ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చామని .. నష్టం నుంచి తట్టుకుని నిలబడేలా రైతుకు మద్ధతుగా నిలిచామని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని.. అగ్రికల్చర్ అసిస్టెంట్, ఆక్వా రైతులకు రూ.1.5కే కరెంట్ ఇచ్చామని , పాల సేకరణలో ఈ ఐదేళ్ల కాలంలో రైతులకు రేట్లు పెరిగాయని సీఎం తెలిపారు.
వందేళ్ల క్రితం భూ సర్వే జరిగిందని.. అప్పటి నుంచి రికార్డులు అప్‌డేట్ కాకపోవడం, సబ్ డివిజన్లు జరక్కపోవడం జరిగిందని జగన్ వెల్లడించారు. 34.77 లక్షల ఎకరాల మీద పూర్తి హక్కులను రైతులకు , పేదలకు కల్పించామని చెప్పారు. రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దారుణంగా మోసం చేశారని.. చివరికి సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎగ్గొట్టారని మండిపడ్డారు. ఈ ఐదేళ్లలో వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.34 వేల కోట్లు, ధాన్యం కొనుగోలు కోసం రూ.65 కోట్లతో పాటు పలు పథకాల కింద రూ.12 లక్షల కోట్లు రైతులకు అందించామని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.