ఏపీలో పొత్తులు, సీఎం సీటుపై ఢిల్లీ వేదికగా పవన్ కీలక వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారంటే..

Published : Jul 18, 2023, 09:57 AM IST
ఏపీలో పొత్తులు, సీఎం సీటుపై ఢిల్లీ వేదికగా పవన్ కీలక వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారంటే..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని ఓడించడమే తన ప్రధాన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని ఓడించడమే తన ప్రధాన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. ఎన్డీయే పక్షాల సమావేశానికి హాజరయ్యేందుకు పవన్ కల్యాణ్ సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో పలు జాతీయ మీడియా చానళ్లకు పవన్ ఇంటర్వ్యూల్లో తాజా రాజకీయాలు, రానున్న ఎన్నికల్లో పొత్తు, సీఎం అభ్యర్థి.. వంటి అంశాలపై స్పందించారు. 2014 ఎన్నికల సమయంలో తాను ఎన్డీయేతో కలిసి పనిచేశామని పవన్ చెప్పారు. 

తాను ఇతర పార్టీలను విమర్శించడం లేదని పేర్కొన్న పవన్.. మోదీకి ఎవరికీ లేనంత స్పష్టత ఉందని చెప్పారు. అందుకే ఆయన ఎన్డీయేని అంత సమర్ధవంతంగా నడిపించగలుగుతున్నారని తెలిపారు. దేశంలో మార్పును కొనసాగించేందుకు 2024 ఎన్నికల్లో మరోసారి ఎన్డీయేను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంతోనే ఎన్డీయే సమావేశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఏపీలో క్షేత్ర స్థాయిలో అధికార వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. ప్రజల ఆధార్ కార్డు, ఇతర వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారని.. అలాంటి సున్నితమైన డేటాను వేరే డేటా సెంటర్లలో స్టోర్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సమయానికి జీతాలు అందడం లేదని అన్నారు. 

అయితే 2019 ఎన్నికల సమయంలో కొన్ని కారణాల వల్ల ఏపీలో ఎన్డీయేలో చీలిక జరిగిందని అన్నారు. 2019 ఎన్నికల తర్వాత తాను మళ్లీ బీజేపీతో కలవడం జరిగిందని అన్నారు. అయితే టీడీపీ అభిప్రాయాలు వారికున్నాయని.. వారి స్టాండ్ ఏమిటనేది తాను మాట్లాడటం లేదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్‌ను వ్యతిరేకించే పక్షాలు ఏకతాటిపైకి రావాలనేది తన అభిప్రాయమని చెప్పారు. అయితే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన మూడు కలిసి పోటీ చేస్తాయని ఆశిస్తున్నట్టుగా తెలిపారు. 

అదే సమయంలో సీఎం సీటుకు సంబంధించి కూడా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు, మద్దతుదారులు కోరుకుంటేనే తాను ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అవుతానని చెప్పారు. ప్రజల్లో ఉన్న బలం, గెలుచుకునే స్థానాలు అనే వాటిపై సీఎం ఎవరనేది ఆధారపడి ఉంటుందని తెలిపారు. తనకు పదవి కాదని.. ప్రజలే తన ప్రాధాన్యత అని చెప్పారు. 

ఇక, పవన్ ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఎన్డీయే భేటీ  కోసం బీజేపీ అగ్రనేతలు తనను ఆహ్వానించినట్టుగా తెలిపారు. తాను చాలా కాలంగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఎన్డీయే విధానాలను ప్రజల వైపు ఎలా తీసుకెళ్లాలో అనేది చర్చించినట్టుగా తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో పురోగతి, ప్రత్యేకించి ఎక్కువ దృష్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై  ఉంటుంది. పొత్తులు ఎలా చర్చకు వస్తాయి అనేది తర్వాత తెలియజేస్తానని చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్