రూటు మార్చిన పవన్‌ కల్యాణ్‌... ఇక జీతం కూడా తీసుకోడట

By Galam Venkata Rao  |  First Published Jul 1, 2024, 3:29 PM IST

‘‘మొన్నటివరకు ఎన్నికల సమయంలో విమర్శలు, ప్రతివిమర్శలు అయిపోయాయి. ఇప్పుడు పూర్తిగా పాలనపారమైన సవాళ్లను అధిగమించాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసింది. వాటిని గాడిలోపెట్టేందుకు పూర్తిస్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉంది’’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు.


ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ రూటు మార్చారు. ఎన్నికల ముందు వరకు ఆవేశంగా, వాడీగా వైసీపీకి వార్నింగ్‌లు ఇచ్చిన ఆయన... ఇప్పుడు శాంతిమంత్రం జపిస్తున్నారు. తమది సాధింపుల ప్రభుత్వం కాదని.. ప్రజల ఆకాంక్షలు సాధించే ప్రభుత్వమని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో సోమవారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గొల్లప్రోలుకు చెందిన దివ్యాంగురాలు మేడిశెట్టి నాగమణికి మొదటి పింఛను అందించారు. అనంతరం పింఛనుదారులతో స్వయంగా మాట్లాడి వారి సాదకబాధకాలు తెలుసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే తాను ఎన్నికలకు వచ్చానని తెలిపారు. ప్రజలంతా జనసేనను వంద శాతం విశ్వసించారని ఆనందం వ్యక్తం చేశారు. వందకు వంద స్ట్రైక్ రేటు ఇవ్వాలని కోరితే.. నిండు మనసుతో ఆశీర్వదించారన్నారు. ఇప్పుడు పాలనలోనూ అదే బలమైన సంకల్పాన్ని చేసుకుంటున్నానని తెలిపారు. 100 శాతం గ్రామాలకు పూర్తిస్థాయి రక్షిత మంచినీటి పథకం అమలైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేయాలన్నదే సంకల్పమని తెలిపారు. 

Latest Videos

‘‘ప్రతి గ్రామం గొంతు తడవాలి. ప్రతి ఇంటికీ లోటు లేకుండా నీరు అందాలి. కాలుష్యపు నీరు లేకుండా ప్రజలందరి ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలన్నదే లక్ష్యం’’ అని ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

‘‘మొన్నటివరకు ఎన్నికల సమయంలో విమర్శలు, ప్రతివిమర్శలు అయిపోయాయి. ఇప్పుడు పూర్తిగా పాలనపారమైన సవాళ్లను అధిగమించాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసింది. వాటిని గాడిలోపెట్టేందుకు పూర్తిస్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉంది’’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు. 

సభలు, ఊరేగింపులు ముఖ్యం కాదు...
“నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు వేవేల ధన్యవాదాలు. గెలవగానే పెద్ద ఊరేగింపు నిర్వహించాలని చాలామంది చెప్పారు. అయితే నియోజకవర్గానికి ఏదైనా మేలు కలిగించే విషయంతోనే వారి ముందుకు వచ్చి కృతజ్ఞత చెప్పుకోవాలనే తలంపుతో ఈ రోజు పింఛన్ల పంపిణీ కోసం నియోజకవర్గానికి వచ్చా. నాకు సభలు, ఊరేగింపులు ముఖ్యం కాదు. నియోజకవర్గ ప్రజలంతా ఆనందంగా ఉండే పనులు చేసి, వారి మన్ననలు పొందడమే ముఖ్యం. ప్రతి నిమిషం రాష్ట్ర శ్రేయస్సు కోసం, క్షేమం కోసం పని చేస్తా. రక్షిత మంచినీరు, ఉపాధి అవకాశాలు, సాగునీటి కాలువల పూడికతీతలు లాంటివి చేసి ప్రజలకు దగ్గర కావాలనేది నా ఆకాంక్ష’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు. 

పంచాయతీరాజ్ వ్యవస్థ నాశనం..
‘‘కీలకమైన పంచాయతీరాజ్ శాఖను తీసుకొని ఆ శాఖలో జరిగిన ముఖ్య విషయాలను అధికారులను అడిగి తెలుసుకుంటుంటే.. గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు బయటపడుతున్నాయి. పంచాయతీరాజ్ నిధులు ఏమయ్యాయో..? ఎలా దారి మళ్లించారో..? కూడా అంతుపట్టడం లేదు. లోతుల్లోకి వెళ్లి సమీక్షిస్తుంటే అధికారులు చెబుతున్న విషయాలు విస్తుగొలిపేలా ఉంటున్నాయి. చిన్నచిన్న మరమ్మతులకు, నిర్మాణాలకు వారు పెట్టిన ఖర్చులు దారణంగా ఉన్నాయి. పంచాయతీరాజ్‌లో చక్కగా పని చేసే అధికారులున్నారు. వారిని సరైన రీతిలో ఉపయోగించుకోవడంలోనే తప్పులు జరిగాయి. వీటిని సరిదిద్దాలి. ఆ శాఖలో పునరుత్తేజం నింపాలి. సమగ్రంగా వ్యవస్థకు జీవం పోయాల్సి ఉంది’’ అని పవన్ కల్యాణ్ చెప్పారు. 
  
అందుకే జీతం వద్దనుకున్నా...
‘‘సమీక్షల్లో భాగంగా ఒక్కో శాఖ ఆర్థిక స్థితిని పరిశీలిస్తుంటే అప్పులు పేరుకుపోయి ఉన్నాయి. పంచాయతీరాజ్‌లో జరిగిన నిధుల దుర్వినియోగం, మళ్లింపు.. ఆ ఫలితంగా నిధుల లేమిని వాస్తవంగా చూసిన తర్వాత నాకు జీతం వద్దని అధికారులతో చెప్పాను. తొలుత జీతం తీసుకొని పని చేస్తానని చెప్పాను. అయితే, అప్పులతో మునిగిపోయిన శాఖ బాధ్యతలు చూస్తూ నేను జీతం తీసుకోవడం భావ్యం కాదు అనుకున్నాను. నా క్యాంపు కార్యాలయానికి సైతం అధికారులు చిన్నచిన్న మరమ్మతులు అవసరం అవుతాయనిచెప్పినా.. వద్దన్నాను. అప్పులు చేసి మరమ్మతులు చేయాల్సిన అవసరం లేదని చెప్పాను. కార్యాలయానికి కొత్త ఫర్నీచర్ కూడా పెట్టొద్దని చెప్పాను. నాకు ఏదైనా అవసరం అయితే నేనే ఫర్నిచర్ కొనుగోలు చేసి తెచ్చుకుంటాను. ప్రభుత్వం నుంచి మాత్రం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పాను. హంగులు, ఆర్భాటాలు కాకుండా నాశనమైన వ్యవస్థలను తిరిగి సరిదిద్దాలనే సంకల్పంతోనే పని మొదలుపెట్టాను. దాని కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తా. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గురించి లోతుగా తెలుసుకుంటున్నా. తర్వాత దాన్ని ఎలా సరిదిద్దాలనే విషయాలపై ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తా. దేశంలోనే అత్యుత్తమంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాలనేది నా ప్రయత్నం’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.

పొల్యూషన్ ఆడిట్ లెక్కలు తీస్తున్నా..
‘‘రాజకీయాల్లోకి డబ్బు కోసమో, పదవి కోసమో రాలేదు. ప్రజల కోసం పని చేయాలనే దృఢమైన సంకల్పంతో వచ్చాను. ప్రజలు ఆశీర్వదించి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. నాకు రాజకీయాల్లో డబ్బు అవసరం లేదు. నా సొంత డబ్బులను ఖర్చుపెట్టుకొనే రాజకీయాలు చేశాను. ప్రజలకు సాయం అందించాను. ఇప్పుడు కీలకమైన శాఖలు చూస్తూ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వేళ ఒకటే చెబుతున్నాను... నా వైపు నుంచి అవినీతికి తావుండదు. దీనికి తగినట్లుగా అధికారులు పని చేయాలి. కీలకమైన పర్యావరణ శాఖను తీసుకున్నాం. దీనికి తగినట్లుగానే రాష్ట్రంలోని ఏ పరిశ్రమల నుంచి ఎంత మేర కాలుష్యం విడుదల అవుతుందనే ఆడిట్ లెక్కలు తీయిస్తున్నాం. పరిశ్రమల నిర్వాహకులే కాలుష్య నిర్యంత్రణ చర్యలు అవలంబించేలా చేయాలి. కాలుష్యం తగ్గించేందుకు ఉన్న అవకాశాలు, కాలుష్యరహిత పరిశ్రమలను ప్రోత్సహించేలా పని చేస్తాం’’ అని పవన్ కల్యాణ్ ప్రకటించారు.  

రుషికొండ తవ్వేసి రాజమహల్ కట్టేసి..
అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో రూ.600 కోట్లు ఖర్చుపెట్టి రుషికొండను తవ్వేసి మరీ రాజమహల్ కట్టారు. ఇప్పుడు అది ఎందుకు పనికిరాకుండా అయింది. ఖర్చుపెట్టిన డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. గత ప్రభుత్వంలోని పెద్దలు చెబుతున్నట్లు విదేశీ అతిథుల కోసం కట్టామని చెబుతున్నారు. వారి కోసం ఇంత ఖర్చు చేయాల్సిన అవసరమేంటి? వైసీపీ ప్రభుత్వంలో విశాఖలో కట్టిన రాజప్రసాదం డబ్బుతో ఓ జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యమయ్యేది. ఓ జిల్లాకు పెట్టాల్సిన డబ్బు ఓ కోటకు పెట్టారు. ఇలాంటివి రాష్ట్రంలో ఎన్నో జరిగాయి. వాటిని తవ్వి బయటకు తీస్తుంటే విస్తుపోవడం మొదట మా వంతు అవుతుంటే... తర్వాత ప్రజల వంతు అన్నట్లు ఉంది. గత ప్రభుత్వంలో జరిగిన విచ్చలవిడి అక్రమాలకు తెరపడాలి. ప్రజలకు అవసరం అయ్యే మార్పులు అన్ని వ్యవస్థల్లో రావాలి. కేంద్ర జల్ జీవన్ మిషన్ పథకం నిధులు కావల్సినన్ని ఉన్నాయి. ప్రతి ఇంటికీ తాగునీరు ఇవ్వాలనే ఆశయంతో జల్ జీవన్ మిషన్ పథకం ఉంటే, దాన్ని గత రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోలేకపోయింది. గోదావరి పక్కనే ఉన్నా తాగునీరు సరిగా లేని చాలా గ్రామాలున్నాయి. కొల్లేరు సరస్సు చెంతనే ఉన్నా మంచి నీరు దొరకని కైకలూరు వంటి ప్రాంతాలున్నాయి. కేంద్ర పథకాన్ని ఉపయోగించుకొని దాహార్తి తీర్చాల్సిన ప్రభుత్వం ఆ నిధులను తెచ్చుకోవడంలో వెనుకబడింది. కేంద్ర పథకాలకు రాష్ట్రం కూడా తగినంత మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాలనే నిబంధన ఉంటుంది. ఒక్కో పథకానికి ఒక్కోలా ఆ గ్రాంటు ఉంటుంది. దాన్ని గత ప్రభుత్వం ఇవ్వక వేల కోట్ల రూపాయల నిధులు వెనక్కు వెళ్లిపోయాయి. రూ.200 కోట్లు, రూ.400 కోట్లు ఇస్తే, వేయి కోట్లు వచ్చే అవకాశం ఉన్నా దాన్ని గత ప్రభుత్వం పట్టించుకోక కేంద్ర నిధులన్నీ ప్రజలకు అందకుండాపోయాయి. వివిధ కేంద్ర పథకాలకు రావల్సిన నిధులను గత ప్రభుత్వం చాలా వరకు తీసుకోలేకపోయింది’’ డిప్యూటీ సీఎం చెప్పారు. 

మోడల్‌గా పిఠాపురం...
‘‘పాలన చేతికొచ్చింది అద్భుతాలు జరిగిపోతాయి అని చెప్పలేను కానీ.. ప్రభుత్వంలో ఏ జరుగుతుందో సామాన్యుడికి అర్థమయ్యేలా పాలన ఉంటుంది. పూర్తిగా గాడి తప్పిన వ్యవస్థలకు జీవం పోయాలి. పాలనలో జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తాం. వారికి జవాబుదారీ పాలన అందిస్తాం. మంచినీరు, పారిశుద్ధ్యం లేని గ్రామాలను తీర్చిదిద్దడానికి మొదటి ప్రాధాన్యం ఇస్తాను. దీనికోసం పిఠాపురంలోనే మొదటి మోడల్ గ్రామాన్ని తీర్చిదిద్దుతాం. భారతదేశంలోనే మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని నిలపాలనేదే నా కోరిక. దీనికి పూర్తిస్థాయిలో పనిచేస్తాను. పరిశ్రమలు, ఉపాధి కల్పన కోసం ఎన్.ఆర్.ఐలతోనూ మాట్లాడుతున్నాను. నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తి ఫోకస్ తో పని చేస్తానె’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

వాలంటీర్లు లేకపోతే పనులు...
తాము నియమించిన వాలంటీర్లు లేకపోతే పింఛన్ల పంపిణీ అసాధ్యమని గత పాలకులు చెప్పారు. అలాంటిది ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వాలంటీర్లు లేకుండా సచివాలయంతోపాటు వివిధ శాఖల సిబ్బందిని ఉపయోగించుకొని పింఛన్ల పంపిణీ మొదలుపెట్టాం. సోమవారం సాయంత్రంలోగా పింఛన్ల పంపిణీ అయిపోతుంది. అరకొర మిగిలితే మంగళవారం పూర్తి చేయాలని ఆదేశించాం. గత ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీ సమయంలో కొందరు వాలంటీర్లు లబ్ధిదారుల వద్ద రూ.100 తక్కువ కాకుండా తీసుకునేవారనే ఫిర్యాదులు గతంలో అందాయి. ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రభుత్వ సిబ్బందితోనే పింఛన్లు పంపిణీ చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. వారు లబ్ధిదారుల వద్ద డబ్బు అడిగేందుకు అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే వారు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి బాధ్యత తీసుకుంటారు. వాలంటీర్లు లేకుండానే వ్యవస్థలతో పని చేయిస్తే ఎలా ఉంటుందో దీనివల్ల చేసి చూపించాం’’ అని పవన్ కల్యాణ్ చెప్పారు.

తప్పు చేసిన వారికి శిక్ష ...
‘‘నేను, సీఎం చంద్రబాబు మాట్లాడుకుంటున్నపుడు రాష్ట్రంలో మొదట వ్యవస్థలను బలోపేతం చేయాలని సమష్టిగా అనుకున్నాం. ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో వరుస తనిఖీలు చేస్తున్నపుడు బయటపడుతున్న అక్రమ రేషన్ బియ్యం వైసీపీ మాఫియా ఎంత బలంగా ఉందో చాటిచెబుతోంది. నేను ఎన్నికలప్పుడు కాకినాడ మాఫియా గురించి చెప్పాను. ఇప్పుడు తనిఖీల్లో భాగంగా వేల మెట్రిక్ టన్నుల అక్రమ రేషన్ బియ్యం బయటపడుతుంటే ప్రజలు కళ్లారా చూస్తున్నారు. రేషన్ బియ్యం కోసం ప్రభుత్వం రూ.39లు రాయితీ భరిస్తోంది. ఆ సొమ్ము ప్రజలది. దాన్ని మాఫియా కొల్లగొడుతోంది. ప్రజాధనం ఎంత కొల్లగొట్టిందో శ్రీ మనోహర్ గారి పరిశీలనలో బహిర్గతం అవడం విస్తుగొలిపింది. ఇక కడపలో బైరెటీస్ గనులన్నీ గుల్ల చేసేశారు. అసలు కనివినీ ఎరుగని స్థాయిలో విధ్వంసం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులకు బాధ్యులకు శిక్ష పడాలి. అధికారులు కూడా  అర్థం చేసుకోవాలి. మాది సాధింపుల ప్రభుత్వం కాదు. ప్రజల ఆకాంక్షలు సాధించే ప్రభుత్వం మాది. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను ప్రజలకు తెలియజెప్పాలి. ఆ బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది’’ అని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. 

ప్రతి రూపాయికీ సమాధానం చెప్పాలి...
నేను సినిమాల్లో వచ్చిన రెమ్యునరేషన్ అకౌంట్లను ఎప్పుడూ క్షుణ్నంగా చూడలేదు. పన్ను ఎంత కట్టాలి..? ఎక్కడ సంతకం పెట్టాలి..? అని అడిగి ముగించేవాడిని. పాలనలోకి వచ్చాక ప్రజా ఖజానా నుంచి ఎంతమేర ప్రజాధనం వినియోగమైంది..? ఎంతమేర పక్కదారి పట్టించారు...? దుర్వినియోగం అనే అన్ని అంశాలను అధికారులు చెబుతుంటే గంటలకు గంటలు వాటిని పరిశీలిస్తున్నాను. వింటున్నాను. నాకున్న సందేహాలను మళ్లీ తీర్చాలని అధికారులను అడుగుతున్నాను. అధికారులు కూడా నన్ను వేరుగా అనుకోవద్దు. కచ్చితంగా ప్రజలకు చెందిన ప్రతి రూపాయికి సరైన సమాధానం చెప్పాలనే కాంక్షతోనే నేను ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నాను. రోడ్లు వేయాలని చూస్తే నిధులేవీ లేకుండా మొత్తం ఊడ్చేశారు. దీనిపై ప్రజలకు నిజానిజాలు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ గర్వించేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం. నేను రెండు తరాల భవిష్యత్తు కోసం పనిచేస్తాను. రాష్ట్ర అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు వెళతాను. రేపటి తరాలకు భరోసానిచ్చేలా బాటలు వేస్తాను’’ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

 

click me!