
విశాఖ విమానాశ్రయంలో మంత్రులు జోగి రమేశ్, రోజా , టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై దాడులకు సంబంధించి అరెస్ట్ అయిన 9 మంది జనసేన నేతలకు బెయిల్ లభించడం పట్ల ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. విశాఖలో అధికారపక్షం బనాయించిన అక్రమ కేసుల కారణంగా జైలు పాలైన జనసేన నేతలు బెయిల్‌పై బయటకు రావడం సంతోషించదగ్గ పరిణామమన్నారు. వీరు కారాగారంలో వున్న సమయంలో వీరి కుటుంబ సభ్యులు ఎంత ఆందోళనకు గురయ్యారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని బయటకు తీసుకొచ్చేందుకు న్యాయ పోరాటం చేసిన జనసేన లీగల్ సెల్ సభ్యులకు, వారికి అండగా నిలిచిన లాయర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు
విశాఖలో అక్రమాలకు పాల్పడుతోన్నవారు ఎవరో నగర ప్రజలకు, ఏపీ ప్రజలకు తెలుసునని పవన్ దుయ్యబట్టారు. వాస్తవాలు మరింతగా వెలుగులోకి వస్తాయనే జనసేన నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు విమానాశ్రయంలో డ్రామాలు సృష్టించారని పవన్ ఆరోపించారు. ఈ ఘటనల సాకుతో జనసేన నేతలు, వీర మహిళలు, కార్యకర్తలను ఇరికించారని.. నిబంధనలకు విరుద్ధంగా వీరిని అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కచ్చితంగా న్యాయ పోరాటం చేయాలని, కేసులు దాఖలు చేయాలని జనసేన లీగల్ సెల్ సభ్యులకు పవన్ కల్యాణ్ సూచించారు.
ALso REad:విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రులపై దాడి... జైలు నుంచి విడుదలైన 9 మంది జనసేన నేతలు
ఇదిలా ఉండగా, విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రులు, వైసీపీ నాయకులపై జరిగిన దాడి కేసులో జనసేన నాయకులను అక్టోబర్ 17న పోలీసులు అరెస్టు చేశారు. జనసేన నాయకులను బాధ్యులను చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. కోన తాతారావు, పీతల మూర్తి యాదవ్, విశ్వక్ సేన్, సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల సందీప్, శివప్రసాద్ రెడ్డి, పివిఎస్ఎన్ రాజు, శ్రీనివాస్ పట్నీయక్, కీర్తీస్, పాలవసల యశస్విని, గేదెల చైతన్య, పట్టిమ రాజును పోలీసులు అరెస్టు చేశారు.
విమానాశ్రయంలో సిసిటివి ఫుటేజీ ఆధారంగా దాడికి ప్రయత్నించిన వారిని గుర్తించి సెక్షన్ 307తో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. మంత్రి రోజా, తదితర వైసిపి నాయకులు విమానాశ్రయానికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు వారిని దూషించి, రాళ్లతోనూ, పార్టీ జెండా కర్రలతోనూ, పదునైన ఇనుప వస్తువులతోనూ దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అక్కడ ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం కూడా జరిగిందని తెలిపారు.