రాజీనామా ఆమోదం: జేడీ లక్ష్మినారాయణపై పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు

By telugu teamFirst Published Jan 31, 2020, 7:11 AM IST
Highlights

పార్టీకి జేడీ లక్ష్మినారాయణ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. జేడీ లక్ష్మినారాయణపై పవన్ కల్యాణ్ తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు.

అమరావతి: పార్టీకి జేడీ లక్ష్మినారాయణ చేసిన రాజీనామాపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. లక్ష్మినారాయణ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ఆయన తెలిపారు. తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పాల ఫ్యాక్టరీలు లేవని, తాను అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగిని కానని పవన్ కల్యాణ్ అన్నారు.

తనకు తెలిసిందల్లా సినిమా ఒక్కటేనని ఆయన అన్నారు. తన మీద ఆధారపడి చాలా కుటుంబాలు జీవిస్తున్నాయని, వారి కోసం, తన కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం సినిమాలు చేయడం తప్పనిసరి అయిందని ఆయన అన్నారు. 

అవన్నీ తెలుసుకుని రాజీనామా లేఖలో లక్ష్మీనారాయణ ప్రస్తావించి ఉంటే బాగుండేదని పవన్ కల్యాణ్ అన్నారు.లక్ష్మినారాయణ భావాలను గౌరవిస్తున్నానని ఆయన అన్నారు.  జనసేనకు లక్ష్మినారాయణ గురువారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Also Read: పవన్‌కు షాక్: జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా

నిరుడు జరిగిన ఎన్నికల్లో జేడీ లక్ష్మినారాయణ విశాఖపట్నం నుంచి జనసేన తరపున లోకసభకు పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల తర్వాత ఆయన దాదాపుగా పవన్ కల్యాణ్ కు దూరంగానే ఉంటూ వస్తున్నారు. 

తన పూర్తి కాలాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తానని పవన్ కల్యాణ్ చెప్పారని, సినిమాల్లో నటించబోనని చెప్పారని లక్ష్మినారాయణ పవన్ కల్యాణ్ కు రాసిన రాజీనామా లేఖలో ప్రస్తావించారు. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్యలు చేశారు. 

click me!