ఆడ బిడ్డలకు రక్షణ ఇవ్వని ఆ చట్టాలతో ప్రయోజనమేంటి?: తేజస్విని హత్యపై పవన్ సీరియస్

Arun Kumar P   | Asianet News
Published : Oct 15, 2020, 07:12 PM IST
ఆడ బిడ్డలకు రక్షణ ఇవ్వని ఆ చట్టాలతో ప్రయోజనమేంటి?: తేజస్విని హత్యపై పవన్ సీరియస్

సారాంశం

విజయవాడ నగరంలో ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని ఓ ప్రేమోన్మాదికి బలైపోయిందని తెలిసి ఎంతో బాధపడ్డానని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు. 

విజయవాడ: ఇంజనీరింగ్ విద్యార్ధిని తేజస్విని ఇంటికి వెళ్లి మరీ నాగేంద్ర అనే యువకుడు కత్తితో ఆమె గొంతు కోసి అతి దారుణంగా హతమార్చిన దుర్ఘటన కృష్ణా జిల్లా విజయవాడ చోటుచేసుకుంది. ఇలా ప్రేమోన్మాది దాడిలో యువతి ప్రాణాలు కోల్పోవడంపై జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవలి కాలంలో ఏపీలో జరిగిన ఇలాంటి అఘాయిత్యాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై, మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాలపై మండిపడ్డారు జనసేనాని. 

''విజయవాడ నగరంలో ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని ఓ ప్రేమోన్మాదికి బలైపోయిందని తెలిసి ఎంతో బాధపడ్డాను. ఉన్నత విద్యను పూర్తి చేసుకొని జీవితంలో స్థిరపడాలని ఆశలతో ఉన్న తమ బిడ్డ హత్యకు గురికావడం కన్నవారికి గర్భశోకాన్ని మిగులుస్తుంది. కొద్ది రోజుల కిందటే విజయవాడలోనే చిన్నారి అనే నర్సు కూడా ఇలాగే ప్రేమ వేధింపుల బారినపడి చనిపోయింది. కోవిడ్ కేంద్రంలో ఎంతో సేవ చేసిన ఆ యువతిని.. పెట్రోలు పోసి ఓ కిరాతకుడు హత్య చేశాడని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. దివ్య తేజస్విని, చిన్నారి కుటుంబాలకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ హత్యలు అత్యంత హృదయవిదారకం'' అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

''రాష్ట్రంలో విద్యార్థినులు, యువతులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల కేసులు పెరుగుతుండటం దురదృష్టకరం. దిశ చట్టం చేశాం అని ప్రచారం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టం ద్వారా ఏం సాధించింది? ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వని చట్టాలు చేసి ప్రయోజనం ఏమిటి... ప్రచారానికి ఉపయోగపడటం తప్ప. అత్యాచారాల కేసుల్లో కేసుల నమోదు విషయంలోనూ పోలీసు శాఖ స్పందన సక్రమంగా ఉండటం లేదు. ఇటీవల తిరుపతిలో ఓ యువతిపై ఒక మత ప్రచారకుడు లైంగిక దాడికి పాల్పడ్డ ఘటనపై కేసు నమోదు చేయకపోతే ఆ బాధితురాలు ‘స్పందన’లో ఫిర్యాదు ఇచ్చుకోవాల్సి వచ్చింది. పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించి.. మహిళల రక్షణ కోసం చట్టాన్ని బలంగా ప్రయోగించాలి. నిందితులకు కఠిన శిక్షలు విధించినప్పుడే.. మహిళలకు తమ రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలపై నమ్మకం కలుగుతుంది'' అంటూ పవన్ కళ్యాణ్ పేరిట జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం