వైఎస్ జగన్ కు పవన్ కల్యాణ్ ఝలక్: అమరావతిపై ప్రకటన

By telugu teamFirst Published Jul 6, 2020, 1:30 PM IST
Highlights

అంబులెన్స్ లను ప్రవేశపెట్టడంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రశంసించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతిపై ఆయనకు ఝలక్ ఇచ్చారు. అమరావతి రైతుల ఆందోళలను వృధా కానీయమని పవన్ కల్యాణ్ అన్నారు.

అమరావతి: రాష్ట్రంలో అంబులెన్స్ లను ప్రవేశపెట్టినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ప్రశంసించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతిపై ఝలక్ ఇచ్చారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించారు. అమరావతి రైతుల ఆందోళనపై ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

"ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని నిర్ణయం అయ్యింది కాబట్టే రైతాంగం తమ 34 వేల ఎకరాల పంట భూములను త్యాగం చేశారు. తమ పాలన వచ్చింది కాబట్టి రాజధాని మార్చుకొంటామని ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఆ రైతాంగాన్ని అవమానించడమే అని జనసేన తొలి నుంచి చెబుతోంది" అని ఆయన అన్నారు. 

"రాజధానిని పరిరక్షించుకొనేందుకు 200 రోజులుగా రైతులు, రైతు కూలీలు, మహిళలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రాజధానిగా అమరావతి ఉండాలని సాగుతున్న ఆ పోరాటానికి మా పార్టీ సంఘీభావం ఉంటుంది. భారతీయ జనతా పార్టీతో కలసి వారికి అండగా నిలబడతాం" అని ఆయన అన్నారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ 29వేల మంది రైతుల త్యాగాలను వృథా కానీయమని అన్నారు. 

"ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తదుపరి వచ్చే పాలకులు అమలు చేస్తూ మరింత పురోగతికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. అంతే తప్ప గత ప్రభుత్వం వేరు మా ప్రభుత్వం వేరు అనడం ప్రజాస్వామ్య విధానం కాదు. రైతులు తమ భూములను ఇచ్చింది ప్రభుత్వానికి తప్ప... ఒక వ్యక్తికో, పార్టీకో కాదు. కాబట్టి ఆ రోజు భూములు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలి" అని ఆయన అన్నారు. 

"రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు విషయంలో కూడా ప్రభుత్వం అలక్ష్యం ప్రదర్శించడం ఎంత మాత్రం భావ్యం కాదు. గత యేడాది కూడా రైతులు నిరసనలు చేపడితే తప్ప కౌలు చెల్లింపులకు నిధులు విడుదల చేయలేదు. ఈ దఫా కూడా అదే పరిస్థితి" అని ఆయన అన్నారు. 

"అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి. అంతే తప్ప రాజధానిని మూడు ముక్కలు చేయడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ అయినట్లు కాబోదు. ఏ జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేయాలి? ఏయే రంగాలను ఏ జిల్లాల్లో అభివృద్ధి చేస్తారు? అక్కడ ఏర్పాటు చేసే అభివృద్ధి ప్రాజెక్టులు ఏమిటి అనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి" అని ఆయన అన్నారు.

"కౌలు చెల్లింపులకు జీవో ఇచ్చారు తప్ప రైతులకు ఇప్పటి వరకూ ఆ మొత్తాలు చేరలేదు. ఏప్రిల్ మాసంలో అందాల్సిన కౌలు ఇప్పటి వరకూ ఇవ్వకపోవడం రైతులను వేదనకు గురి చేయడమే" అని పవన్ కల్యాణ్ అన్నారు.. 

click me!