జైలు నుంచి వచ్చి జగన్, దొడ్డిదారిన మంత్రి అయిన లోకేష్: పవన్

First Published Jul 27, 2018, 7:47 AM IST
Highlights

అన్ని రోజులు జైలులో ఉన్న వ్యక్తి లేదా దొడ్డిదారిలో మంత్రి అయిన వ్యక్తి మన నెత్తి మీద ఎక్కి తొక్కేస్తామంటే ఎలా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైఎస్ జగన్ ను, నారా లోకేష్ ను ఉద్దేశించి ఆయన ఆ ప్రశ్న వేశారు. 

భీమవరం: అన్ని రోజులు జైలులో ఉన్న వ్యక్తి లేదా దొడ్డిదారిలో మంత్రి అయిన వ్యక్తి మన నెత్తి మీద ఎక్కి తొక్కేస్తామంటే ఎలా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైఎస్ జగన్ ను, నారా లోకేష్ ను ఉద్దేశించి ఆయన ఆ ప్రశ్న వేశారు. 

గురువారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని ఒక కల్యాణ మండపంలో ముస్లింలు, విద్యార్థులు, న్యాయవాదులు, అభిమానులతో విడివిడిగా సమావేశమయ్యారు.  ఇతరుల మాదిరిగా ఒళ్లు బలిసి తాను మాట్లాడబోనని అన్నారు. జగన్‌ మాదిరిగా తాను తిట్టగలనని,  గొడవ పెట్టుకోగలనని, కానీ దాంతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు. 

ఎన్ని కష్టాలు, బాధల మధ్య సంఘటనలు జరుగుతాయో వారికి తెలుసా అని ఆయన ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు మాట్లాడితే సింగపూర్‌ తరహా రాజధాని అంటారు గానీ సింగపూర్‌ తరహా పాలన అందిస్తామని ఎక్కడా చెప్పరని అన్నారు. సామాజిక రాజకీయ వ్యవస్థను మార్చకపోతే గూండాలు, ఫ్యాక్షనిస్టులు రాజ్యమేలుతారని అన్నారు.

ఏమీ ఆశించకుండా స్వార్థం లేని వ్యక్తులే రాజకీయాలలో ఉండాలని పవన్ విద్యార్థులతో అన్నారు. తుపాకీతో కాల్చేసినోళ్లు, దోపిడీ చేసేవాళ్లు చట్టం నుంచి తప్పించుకుని మన మీద పెత్తనం చేస్తున్నారని ఆయన తప్పు పట్టారు. బ్రోకర్‌ పనిచేసేవాడు కోట్లు సంపాదిస్తుంటే పీజీలు, పీహెచ్‌డీలు చేసిన విద్యావంతులు వారి కింద పనిచేస్తున్నారని అన్నారు. 

ముఖ్యమంత్రి కొడుకే ముఖ్యమంత్రి కావాలా అని ఆయన నారా లోకేష్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. న్యాయవాది కుమారుడు, రైతు కూలీ కుమారుడు ముఖ్యమంత్రి కాకూడదా అని అన్నారు.
 
ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగిన రోజే నిజమైన స్వాతంత్య్రమని గాంధీ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం పగలు కూడా తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆనయ అన్నారు. 
2019 ఏపీ రాజకీయాల్లో చాలా కీలకమని, అందరూ ఓట్లు నమోదు చేయించుకోవాలని అన్నారు. రాజకీయ నాయకుల విధానాల వల్ల సామాన్యులు ఇబ్బందులు పడకూడదనే మరో 25 ఏళ్లు తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 

click me!