జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీజేపీల మధ్య ఆయన దళారీగా మారారని అన్నారు. చెగువేరా డ్రెస్ వేసుకుని.. ఇప్పుడు సావర్కర్ డ్రెస్ వేసుకుంటున్నారని, భవిష్యత్‌లో గాడ్సె తుపాకీ పడుతారనే అనుమానం ఉన్నదని పేర్కొన్నారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నిలకడలేని మనిషి అని అన్నారు. ఆయన ఒక్క చోట మూడు నిమిషాలు స్థిరంగా నిలబడలేడని విమర్శించారు. ఆయన రాజకీయాలు కూడా అలాగే అస్థిరమైనవని అన్నారు. పవన్ కళ్యాణ్ చెగువేరా డ్రెస్ వేసుకుని ఇప్పుడు సావర్కర్ డ్రెస్ వేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత గాడ్సేలా తుపాకీ కూడా పట్టుకుంటాడని తాను సందేహిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ, బీజేపీల మధ్య ఆయన ఒక దళారీ అవతారం ఎత్తారని విమర్శలు సంధించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగారు. కానీ, ఆ కూటమి ఏమంతా ఆశాజనక ఫలితాలను ఇవ్వలేదు. వామపక్షాలతో కలిసి ఎన్నికల్లో దిగిన పవన్ కళ్యాణ్ నేడు రైట్ వింగ్ గూటికి చేరుకున్నారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న ఎన్డీయే కూటమి సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరుకాబోతున్నారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాను పాచిపోయిన లడ్డూ అని కేంద్రంలోని బీజేపీని విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలా ఎన్డీయే గూటికి చేరుతున్నారని ప్రశ్నించారు. ఆయన ఫిలాసఫీ ఏమని నిలదీశారు. వామపక్షాలపై అభిమానం అని, చెగువేరా తనకు ఆదర్శనమని పవన్ చెప్పారు. ఆయన లైబ్రరీలోనూ వామపక్షాల పుస్తకాలు ఉన్నాయని వివరించారు. ముందు చెగువేరా డ్రెస్ వేసుకుని ఇప్పుడు సావర్కర్ దుస్తులు ఎలా వేసుకుంటున్నారనే తాను ప్రశ్నిస్తున్నానని నారాయణ అన్నారు. చెగువేరా డ్రెస్ వేసుకున్నాడు కాబట్టే తాను ఈ ప్రశ్న వేస్తున్నట్టు స్పష్టించారు.
Also Read: విపక్షాల కూటమికి కొత్త పేరు ‘INDIA’ .. అర్ధం ఏంటంటే, మరి సారథి ఎవరు.. వివరాలివే..!!
ఆయన ఒక దళారీగా మారారని అన్నారు. టీడీపీ, బీజేపీల మధ్య ఒక దళారీగా ఉన్నారని పేర్కొన్నారు. తన వైఖరి ఆయన స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తాము టీడీపీతో ఉంటూ ఎన్డీయేలో ఉంటామని, లేదా.. టీడీపీతో తెగదెంపులు చేసుకుని ఎన్డీయేలో ఉంటామనైనా చెప్పాలి కదా అని అన్నారు.
అతను ఎన్డీయేలో చేరడం దురదృష్టకరమన్నారు. అది దేశానికి, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, అంతిమంగా పవన్ కళ్యాణ్‌కు కూడా ప్రమాదకరమే అని పేర్కొన్నారు.