ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. పాత, కొత్త ముఖాల కలయితకతో ఈ మంత్రి వర్గం రూపుదిద్దుకుంది. అయితే ఈ మంత్రి వర్గంలో కాపు సామాజిక వర్గానికి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. కాపుల మద్దతు కూడగట్టుకునేందుకు సీఎం జగన్ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ సీఎం జగన్ కొత్త టీం రెడీ అయ్యింది. మంత్రివర్గం పునర్వవ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా పాత మంత్రులందరూ రాజీనామా చేశారు. దీంతో కొత్త మండలి ఉండే ఎమ్మెల్యేలను ఆదివారం శ్రీరామనవమి పర్వదినాన ప్రకటించారు. ఇందులో మొత్తం 25 మంది మంత్రుల పేర్లు ఉన్నాయి. ఇందులో పది మంది పాత వారికి మళ్లీ అవకాశం దక్కగా.. 15 మంది కొత్త వారికి పదవులు కట్టబెట్టారు.
సీఎం జగన్ కొత్త కేబినెట్ ను గమనిస్తే సామాజికవర్గం వారిగా మంత్రి పదవులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్ద పీఠ వేసినట్టుగా అర్థమవుతోంది. కాపులకు వైసీపీపై వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఇలా ఎక్కువ మంది కాపులకు ప్రాధాన్యత ఇచ్చారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
undefined
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే ఏపీలోని అధికార పార్టీ నాయకులు, మంత్రులు పవన్ కల్యాణ్ పై చేసిన కామెంట్స్ వల్ల ఆ సామాజిక వర్గంలో జగన్ పార్టీపై కొంత వ్యతిరేకత ఏర్పడింది. అలాగే మొదటి నుంచి ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు వైసీపీపై మొదటి నుంచి కొంత అసంతృప్తిగానే ఉన్నారు. వారిలో కలిగిన ఈ భావనను తొలగించడానికే ఈ సారి వారికి పెద్ద పీఠ వేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఏపీలో పార్టీల గెలుపోటములపైన కాపు సామాజిక వర్గం తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏ పార్టీ అధికారం చేపట్టేందుకు అయినా ఈ సామాజికవర్గం ఓటు బ్యాంకు కీలకంగా పని చేస్తుంది. 2014 ఎన్నికల కంటే ముందే జనసేన పార్టీ ఆవిర్భవించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ ఎక్కడా ఆ పార్టీ పోటీ చేయలేదు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఆటోమెటిక్ గా కాపు ఓటు బ్యాంకు మొత్తం టీడీపీ వైపు మళ్లింది. కాబట్టి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ ప్రతిపక్షంలో కూర్చుంది.
కొంత కాలం తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి, పవన్ కల్యాణ్ కు దూరం పెరిగింది. దీంతో 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఒంటరిగా పోటీ చేశాయి. దీంతో కాపు ఓటు బ్యాంకు చీలిపోయింది. దీంతో ఈ రెండు పార్టీలకు నష్టం జరిగింది. కానీ వైసీపీకి మాత్రం లాభం జరిగింది. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. సీఎం జగన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ఈ సారి పవన్ కల్యాణ్ ఎన్నికల్లో గట్టిగానే పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో జనసేన వైపు కాపు ఓట్లు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో రెండో సారి అధికారం చేపట్టాలనే వైసీపీ ఆశయానికి ఎదురుదెబ్బ తగలొచ్చు. అందుకే పవన్ కల్యాణ్ నుంచి కాపు ఓట్లను తన పార్టీవైపు మళ్లించేందుకు, అలాగే వారి నుంచి వ్యతిరేకత తగ్గించేందుకు జగన్ కాపు మంత్రాంగాన్ని అమలు చేస్తున్నారు.
వైసీపీ కాపు సామాజికవర్గానికి అనుకూలంగా ఉంటుందనే వాయిస్ ను వినిపించేందుకు సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కొత్త మంత్రి వర్గంలో ఆ సామాజిక వర్గం నేతలకు గతంలో కంటే ఎక్కువగా మంత్రి పదవులు కేటాయించారు. ఈ సారి కాపు సామాజిక వర్గం నుంచి బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్ నాథ్, దాడిశెట్టి రాజా, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబులకు స్థానం దక్కింది. ఇందులో బొత్స సత్యనారాయణ గత కేబినేట్ నుంచి కొనసాగుతున్నారు. ఆయనకు సీఎం జగన్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే మరి ఇలా కాపు ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు సీఎం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో తెలియాలంటే వచ్చే ఎన్నికలకు వరకు ఎదురు చూడాల్సిందే..