వాళ్ల బాబుకి జాబొచ్చింది.. మరి మన ఇంట్లో బాబుల సంగతేంటి..?

First Published Jul 2, 2018, 4:48 PM IST
Highlights

వాళ్ల బాబుకి జాబొచ్చింది.. మరి మన ఇంట్లో బాబుల సంగతేంటి..?

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ప్రజా పోరాట యాత్రలో భాగంగా ఇవాళ విజయనగరం జిల్లా ఎస్.కోటలో పవన్ పర్యటించారు.. స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గంలో 30 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీయే అధికారంలో ఉంది కానీ.. ఒక్క రైల్వే బ్రిడ్డి వేయడానికి వాళ్లకి తీరిక లేదా అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రికి రాష్ట్రమంతా ఒకటేనని పట్టిసీమకు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తారు.. మరి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఇక్కడి బాబూ జగ్జీవన్ రామ్ ఎత్తిపోతల పథకానికి మాత్రం డబ్బులు లేవంట.. ఇలాంటి వైఖరి వల్ల ప్రాంతీయ అసమానతలు తలెత్తుతాయని పవన్ అన్నారు. ఉత్తరాంధ్రకు నిధులు కేటాయించాలని నేను కోరితే.. నేను ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నానని  ముఖ్యమంత్రి అంటున్నారని విమర్శించారు.

వెనుకబడిన ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని.. 20 లక్షల మంది ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారని పవన్ అన్నారు.. జనసేన పార్టీ ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడితే.. ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగ భృతి ఇచ్చి కంటితుడుపు చర్య చేపట్టారన్నారు. కానీ వారికి కావాల్సింది నిరుద్యోగ భృతి కాదని... ఉద్యోగమని పవన్ తెలిపారు.

బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల ప్రచారంలో బాగా ప్రచారం చేశారని.. అయితే వాళ్ల బాబుకి తప్ప మన ఇంట్లో బాబులకి జాబులు రాలేదని పవన్ ఎద్దేవా చేశారు. అనుభవం ఉన్న వారైతే అసమానతలు రాకుండా మంచి పరిపాలన అందిస్తారని నమ్మి తాను తెలుగుదేశం పార్టీకి మద్ధతు ప్రకటించానన్నారు. కానీ ఆ పార్టీ సుపరిపాలన అందించడంలో విఫలమైందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. 


 

click me!