
Vangaveeti Radhakrishna: వంగవీటి రంగా తనయుడు, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ ఓ ఇంటి వాడయ్యాడు. గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి కుమార్తె జక్కం పుష్పవల్లితో వంగవీటి రాధా వివాహం జరిగింది. విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వివాహానికి ఎంతోమంది రాజకీయ నాయకులు, ప్రముఖ రాజకీయ నాయకులు విచ్చేసి.. నూతన వధువరులకు ఆశీర్వదించారు.
ఇక ఈ వివాహానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఈ వివాహా వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్ట్ గా మారారు పవన్ కళ్యాణ్. కాసేపు రాధాతో కాసేపు మాట్లాడి.. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
అలాగే.. ఈ ఫోటోలను జనసేన తన అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి.. విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుకకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. ఆదివారం రాత్రి విజయవాడ, పోరంకిలోని మురళీ రిసార్ట్స్ లో జరిగిన ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ , పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు హాజరయ్యారు. నూతన వధూవరులు వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లిలకు శుభాకాంక్షలు తెలిపారు. అని పోస్టు చేశారు. వంగవీటి రాధాకు పార్టీలకు అతీతంగా చాలా మిత్రులు ఉండడంతో ఆయన వివాహ వేడుకలో పలు పార్టీల నేతలు తారసపడ్డారు. రాధా, పుష్పవల్లి నిశ్చితార్థం ఆగస్టులో జరిగింది.