తగ్గేదేలే అంటున్న పవన్.. ప్రతి అడుగులో టార్గెట్ వైసీపీ.. సినిమా ఫంక్షన్‌లో అదే రంగు..!

By Sumanth KanukulaFirst Published Dec 11, 2022, 2:22 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం కోసం రూపొందిస్తున్న వాహనం రోడ్లమీదకు రాకముందే వివాదానికి కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ చేస్తున్న విమర్శలకు పవన్ తనదైన శైలిలో కౌంటర్స్ ఇస్తున్నారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం కోసం రూపొందిస్తున్న వాహనం రోడ్లమీదకు రాకముందే వివాదానికి కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. తన ప్రచార వాహనానికి వారాహి అని పేరు పెట్టిన పవన్ కల్యాణ్ ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే వాహనం ఆలివ్ గ్రీన్‌ కలర్‌లో ఇది.. చట్ట ప్రకారం నిషేధిత జాబితాలో ఉందని ఏపీలోని అధికార వైసీపీ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అయితే పవన్ కల్యాణ్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఓ వైపు వైసీపీ విమర్శలకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇస్తూనే.. మరో వైపు బహిరంగ వేదికపై నుంచి వైసీపీకి ధీటైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ పూజా కార్యక్రమం ఆదివారం హైదాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పవన్ కల్యాణ్.. వారాహి వాహనం రంగును పోలిన చొక్కాను ధరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు విపరీతంగా షేర్ చేస్తున్నారు. 

ఇక, పవన్ కల్యాణ్ ఇటీవల విశాఖపట్నం, ఇప్పటం పర్యటనల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ అధికార వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు వారాహి రంగుపై వివాదం నెలకొన్న నేపథ్యంలో.. పవన్ మరోసారి వైసీపీపై కౌంటర్ అటాక్ చేస్తున్నారు. 

అసలు వివాదం ఏమిటి..?
పవన్ కల్యాణ్ ఈ నెల 7వ తేదీన సోషల్ మీడియాలో  ఎన్నికల సమరానికి వారాహి సిద్దంగా ఉందంటూ ఓ పోస్టు చేశారు. తాను ప్రచారం నిర్వహించనున్న వాహనం ఫొటోలు, వీడియోను షేర్ చేశారు. అయితే వాహనం రంగుపై వైసీపీ నుంచి అభ్యంతరం వ్యక్తం అయింది. పవన్ వాహనంపై ఉన్న ఆలివ్ గ్రీన్ కలర్‌ను డిఫెన్స్ వాహనాలు మినహా ఇతర వాహనాలకు ఉపయోగించకూడదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కేంద్ర మోటారు వాహన చట్టం ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతుందని అన్నారు. అదే రంగు ఉంటే వాహనం రిజిస్టర్ అవ్వద్దని చెప్పారు. పవన్ కళ్యాణ్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. వాహనం రంగును ఎలాగో మర్చాలి కదా.. అదేదో పసుపు రంగు వేసుకుంటే  సరిపోతుందని వ్యంగ్యస్త్రాలు సంధించారు. 

దీంతో పవన్ ప్రచార వాహనం రంగుపై జనసేన, వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు దూషించుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే స్పందించిన పవన్ కల్యాణ్‌ వైసీపీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ట్వీట్ చేశారు. “మొదట మీరు నా సినిమాలను ఆపేశారు. విశాఖపట్నంలో నన్ను వాహనం, హోటల్ గది నుండి బయటకు రానివ్వలేదు. నన్ను నగరం వదిలి వెళ్ళమని బలవంతం చేశారు. మంగళగిరిలో నా కారును బయటకు వెళ్లనివ్వలేదు, తర్వాత నన్ను నడవనివ్వలేదు. ఇప్పుడు వాహనం రంగు సమస్యగా మారింది. ఒకే తర్వాత నేను శ్వాస తీసుకోవడం ఆపేయమంటారా?’’ అని పవన్ ట్వీట్ చేశారు. 

అలాగే ఆలివ్ గ్రీన్ కలర్ షర్ట్ ఫొటోను షేర్ చేసిన పవన్ కల్యాణ్.. కనీసం ఈ చొక్కా వేసుకోవడానికైనా తనకు అనుమతి ఉందా వైసీపీ? అంటూ సెటైర్లు వేశారు. అలాగే పవన్ కల్యాణ్‌కు మాత్రమేనా రూల్స్ అంటూ కూడా ప్రశ్నించారు. 

మరోవైపు ఇదే వివాదంపై స్పందించిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. వారి పార్టీ జెండా రంగులపై అమితమైన ప్రేమ చూపుతున్న వైసీపీకి పవన్‌ వాహనంపై మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. ప్రభుత్వ భవనాలపై వైసీపీ జెండా రంగులు వేయడంపై కోర్టులు కూడా తప్పుబట్టాయని అన్నారు. 

click me!