ఏపీ స్థానికత హోదా గడువు మరో మూడేళ్లు పొడిగింపు.. గత ఉత్తర్వుల్లో సవరణ..

Published : Dec 11, 2022, 11:47 AM IST
ఏపీ స్థానికత హోదా గడువు మరో మూడేళ్లు పొడిగింపు.. గత ఉత్తర్వుల్లో సవరణ..

సారాంశం

రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి విద్య, ఉద్యోగాల్లో స్థానికత హోదా పొందాలని అనుకునేవారికి మరోసారి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 

రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి విద్య, ఉద్యోగాల్లో స్థానికత హోదా పొందాలని అనుకునేవారికి మరోసారి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి అక్కడ స్థానికత పొందడానికి ఇప్పటివరకు ఉన్న ఏడేళ్ల గడువును మరో మూడేళ్లు కేంద్రం పొడిగించింది. ఈ మేరకు గత ఉత్తర్వుల్లో సవరణలు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో తెలంగాణ నుంచి స్వరాష్ట్రానికి చేరుకునే ఏపీ వాసులకు విద్య, ఉద్యోగాల్లో స్థానిక  హోదా పొందడానికి మరికొంతకాలం అవకాశం ఇచ్చినట్టు అయింది. 

ఏపీ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో.. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారికి విద్య, ఉద్యోగాలలో స్థానికతకు సంబంధించి ఇప్పటివరకు ఏడేళ్ల గడువు ఉంది. ఆ గడువు ఇటీవల ముగియటంతో స్థానికత ఉత్తర్వులను మరో మూడేళ్లకు పొడిగించాల్సిందిగా ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.

దీంతో గత ఉత్తర్వుల్లో స్థానికత గడువును పదేళ్లకు పెంచారు. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీలోని క్లాజ్ 1,2ల కింద అధికారాలను ఉపయోగించి రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్ 1975, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్) అమెండ్‌మెంట్ ఆర్డర్ 1974ని సవరిస్తూ ఉతర్వులనిచ్చారు. 

రాష్ట్ర విభజన అమల్లోకి వచ్చిన 2014 జూన్ 2 నుంచి మూడేళ్లలోపు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చినవారు ఏపీలో స్థానిక హోదా పొందవచ్చని తొలుత 2016 జూన్‌లో గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. తర్వాత ఆ గడువును మరో రెండేళ్లకు పొడిగిస్తూ 2017లో గెజిట్ నోటిఫికేషన్‌లో సవరణ చేశారు. ఆ తర్వాత గడువును మరో రెండేళ్లకు పొడిగిస్తూ 2019 అక్టోబర్‌లో మరోసారి నోటిఫికేషన్‌లో సవరణ చేశారు. అయితే స్థానికత హోదా విషయంలో కేంద్రం ఇచ్చిన గడువు 2021 జూన్ 1తో ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు.. తాజాగా  మరోసారి కేంద్రం ఆ గడువును పెంచింది. దీంతో రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి 10 ఏళ్ల లోపు తెలంగాణ నుంచి ఏపీకి చేరుకున్న వారు ఏపీలో స్థానిక హోదా పొందేందుకు అవకాశం కల్పించినట్టయింది.  ఇప్పటికీ తెలంగాణ నుంచి ఏపీకి రావాలని అనుకున్నవారు.. ఇక్కడకు వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకుంటే.. వారు ఎంచుకున్న జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు స్థానికత వర్తించనుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్