
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సిద్దం అవుతున్నాయి. జనసేన పార్టీ కూడా అధికార వైసిపిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రముఖ నిర్మాత బన్ని వాసును జనసేన ప్రచార విభాగం ఛైర్మన్ గా నియమించారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.
మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బన్నీవాసుతో కలిసి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రచార విభాగం ఛైర్మన్ గా వాసు పేరును ప్రకటించిన జనసేనాని స్వయంగా నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు. దీంతో సినిమాల్లో బిజీబిజీగా వుండే వాసు ఇక రాజకీయాల్లో బిజీ కానున్నారు.
ఏ రాజకీయ పార్టీలో అయినా ప్రచార విభాగం చాలా ముఖ్యమని... పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళేది ప్రచారమేనని పవన్ కల్యాణ్ అన్నారు. కాబట్టి జనసేన పార్టీ ఆశయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత బలోపేతం చేయాలని అన్నారు. రాబోయేది ఎన్నికల ఏడాది కాబట్టి టిడిపి, జనసేన కూటమిని, నాయకులకు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని బన్ని వాసుకు పవన్ సూచించారు.
Also Read RGV: జనసేనలో చంద్రబాబు కోవర్టు ఆయనే.. : ఆర్జీవీ తీవ్ర వ్యాఖ్యలు.. ‘వ్యూహం’లో భాగమేనా?
ఇలా ఓవైపు పార్టీలోని కీలక పదవులను భర్తీ చేస్తూనే మరోవైపు ఇతర పార్టీలనుండి నాయకులను ఆహ్వానిస్తున్నారు పవన్ కల్యాణ్. ఈ క్రమంలోనే విశాఖపట్నంకు చెందిన వైసిపి కార్పోరేటర్ మహ్మద్ సాధిక్ తో పాటు ప్రకాశంజిల్లాకు చెందిన గరికపాటి వెంకట్ లను జనసేనలో చేర్చుకున్నారు. వారికి పవన్ కల్యాణ్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఇక జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో ఇటీవల అనంతపురంకు చెందిన బలిజ సంఘం నాయకులు పేరూరు శ్రీనివాసులు, అంబరపు కృష్ణ పార్టీలో చేరారు. ఉమ్మడి గుంటూరు జిల్లా మాచర్లలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో వైసిపి నాయకులు జనసేనలో చేరారు. ఇలా కులసంఘాలు, వైసిపి నాయకులకు చేర్చుకుంటూ చాపకింద నీరులా విస్తరిస్తోంది జనసేన.