ఏపీ సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్: ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

By telugu teamFirst Published Apr 22, 2021, 4:37 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఏపీ సీఎం అభ్యర్థిగా బిజెపి ప్రకటించడంపై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి తీరుపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ ను తమ ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బిజెపి ప్రకటించడంపై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. దానిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 

ఎవరు ఏమైనా చెప్పినీయండి, పవన్ కల్యాణ్ ప్రజల ముందుకు వచ్చి తన సిద్ధాంతాన్ని చెప్పాలని ఆయన అన్నారు. ఎవరో ఎవరినో సీఎం చేయడం ఏమిటని ఆయన అడిగారు. దాన్ని సీరియస్ గా తీసుకోకూడదని అన్నారు. సీఎంను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ ను బిజెపి సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ఫ్యాన్ ఫాలోయింగ్ లా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వీళ్లు పనిచేయాలి కదా, పనిచేయడం లేదని అర్థం కదా అని బిజెపి వాళ్లను ఉద్దేశించి అన్నారు. పవన్ కల్యాణ్ రాడు, ఆయన చేయలేడు అని ప్రకాశ్ రాజ్ అన్నారు. 

దేశమంతా ఒకే ఫార్ములా తెస్తామని బిజెపి అంటోందని, అది సరి కాదని ఆయన అన్నారు. అందుకే కేసీఆర్, మమతా బెనర్జీ ఫెడరల్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారని, దేశమంతా ఒకే ఫార్ములా కుదరదని, భిన్న సంస్కృతులూ భాషలూ భిన్నమైన అవసరాలూ ఉంటాయని ఆయన అన్నారు. తెలంగాణలోనో, ఆంధ్రప్రదేశ్ లోనో ఎవరు వ్యవసాయ శాఖ మంత్రి కావాలో ఉత్తర భారతీయుడు చెప్తాడా, అది సరి కాదని ఆయన అన్నారు. 

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రేవైటీకరణ నిర్ణయాన్ని ప్రకాశ్ రాజ్ వ్యతిరేకించారు. అమ్ముకుంటున్నారని ఆయన మండిపడ్డారు. నష్టాలు వస్తున్నాయి కాబట్టి విక్రయిస్తున్నామని అంటున్నారని ప్రస్తావించగా ప్రభుత్వం వ్యాపారం చేయకూడదని, అది ప్రభుత్వం పని కాదని ఆయన అన్నారు. ప్రజలు దానికి యజమానులని, నష్టాలు వచ్చినా వారికేనని, సామాజిక సేవకు సంబంధించిన రంగాల్లో వస్తున్న నష్టాలను ఇతర రూపాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుని భర్తీ చేయాలని ఆయన అన్నారు. నష్టాలు వస్తే ప్రభుత్వానికి ఏం నొప్పి అని, అది ప్రజల పెట్టుబడి అని ఆయన అన్నారు. 

పశ్చిమ బెంగాల్ లో బిజెపి గెలుస్తుందని ప్రశాంత్ కిశోర్ అన్నట్లు బిజెపి చేసిన ప్రచారం గురించి ప్రస్తావించగా, ఏదో ఎక్కడో ప్రైవేట్ గా మాట్లాడిదాన్ని కట్ చేసి, తమకు అనుకూలంగా మలుచుకుంటే ఎలా అని అడిగారు. ప్రశాంత్ కిశోర్ విశ్లేషకుడు మాత్రమేనని, ప్రజలు చెప్పాలి కదా అని ప్రకాశ్ రాజ్ అన్నారు. 

click me!