సర్వే చేయించుకున్న పవన్

First Published Dec 12, 2016, 2:43 AM IST
Highlights

వచ్చే సాధారణ ఎన్నికలకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రీ ఫైనల్స్ లాంటివే.

తన రాజకీయ భవిష్యత్తుపై  ఓటర్ నాడి తెలుసుకునేందుకు పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించుకున్నారు. ప్రజాభిప్రాయం ఏమిటో తెలుసుకునే ఉద్దేశ్యంతోనే పవన్ సర్వే చేయించారు. 13 జిల్లాల్లోని కాపు సంఘాల ప్రముఖులతో కూడా సర్వే బృందం చర్చలు జరిపినట్లు సమాచారం. అంటే, త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుపై జనసేన అధ్యక్షుడు ఓ ప్రకటన చేసే సూచనలు కనబడుతున్నాయి.

 

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పవన్ 13 జిల్లాల రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విడదీసారు. ఒకటి రాయలసీమ, రెండోది ఉత్తరాంధ్ర, మూడోది కోస్తా ప్రాంతం. రాయలసీమలో నాలుగు జిల్లాలుండగా, ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలున్నాయి.

 

ఇక, కోస్తా ప్రాంతంలో ఆరు జిల్లాలున్నాయి. పై మూడు ప్రాంతాల్లో కాపులు ఎక్కువగా ఎక్కడున్నారనే విషయంపై పవన్ ఎక్కువ దృష్టి పెట్టారు.

 

అదే సందర్భంలో అధికార టిడిపిపైన కూడా పవన్ ప్రజాభిప్రాయం సేకరించినట్లు తెలుస్తోంది. స్ధూలంగా చూస్తే, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయింది కాబట్టి టిడిపిపై ప్రజావ్యతిరేకత ఉంటుందనటంలో సందేహం అక్కర్లేదు. అయితే, ఆ వ్యతిరేక ఏ స్ధాయిలో ఉందన్న విషయాన్నే పవన్ తెలుసుకోవాలనుకున్నారు.

 

త్వరలో జరుగుతాయనుకుంటున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ విషయమై ఓ స్పష్టత వస్తుంది. ఒక వేళ మున్సిపల్ ఎన్నికలు జరిగితే జనసేన పోటీ చేసే విషయమై ఏదో నిర్ణయం తీసుకోవాలి కాబట్టే పవన్ మొదటి రౌండ్ సర్వే చేయించుకున్నారు.

 

అయితే, ఇక్కడే పవన్ కొన్ని విషయాలపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబుతో కలిస్తే, ప్రభుత్వ వ్యతిరేకత తనపైనా ప్రభావం చూపుతుందా? అలాగని, ప్రతిపక్షం వైసీపీతో కలిస్తే ప్రజామోదం ఏమేరకు లభిస్తుంది? రెండూ కాదని ఒంటరిగా పోటీ చేస్తే ముక్కోణపు పోటీలో ఏ పార్టీకి లాభమన్న విషయమై యోచిస్తున్నారు.

 

ఎందుకంటే, ప్రజాసమస్యలపై వామపక్షాలతో కలిసి పనిచేయాలని అనుకున్నట్లు పవనే చెప్పారు. ప్రత్యేకహోదా, రాజధాని నిర్మాణం, బందర్ పోర్టు అభివృద్ధి లాంటి వాటికి అవసరాలకు మించి వ్యవసాయ భూములను ప్రభుత్వం తీసుకుందని పవన్ అభిప్రాయపడుతున్నారు. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాలతో కలిస్తే  ఎలాగుంటుందని  కూడా యోచిస్తున్నారు.

 

అంటే, ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే, పై రెండు విషయాల్లో పవన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్షాలతో కలిసి ఉద్యమాలు చేయనున్నారని. అందులోనూ ఎన్నికలు జరుగుతాయనుకుంటున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఎనిమిది జిల్లాల్లో ఉన్నాయి. కాబట్టి వచ్చే సాధారణ ఎన్నికలకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రీ ఫైనల్స్ లాంటివే.

 

అందుకనే పవన్ ప్రాంతాల వారీగా సర్వే చేయించుకున్నారు. జనసేన విషయంలో మొత్తం ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది, ప్రత్యేకించి కాపుల్లో తనపై ఉన్న అభిప్రాయాలేమిటనే విషయమై పవన్ స్పష్టత కోరుకుంటున్నారు. జనసేన విషయంలో సోషల్ మీడియాలో వచ్చే అభిప్రాయాలను కూడా సేకరించాలని పవన్ కల్యాణ్ అనుకోవటం ఆసక్తికరం. 

click me!