కామినేనికి అవమానం..సమావేశం నుండి వెళ్ళిపోయిన మంత్రి

First Published Feb 19, 2018, 11:36 AM IST
Highlights
  • చంద్రబాబుకు కౌంటర్ గా పలువురు బిజెపి నేతలు మాట్లాడుతున్నా కామినేని మాత్రం ఒక్కమాట కూడా మాట్లాడలేదు.

సొంతపార్టీలోనే మంత్రి కామినేని శ్రీనివాసరావుకు అవమానాలు ఎదురయ్యాయా? అవుననే అంటున్నాయి బిజెపి వర్గాలు. బిజెపిలోని చంద్రబాబునాయుడు  ప్రధాన మద్దతుదారుల్లో కామినేని కూడా ఒకరు. ఆ విషయాన్ని కామినేని ఎప్పుడూ దాచుకోలేదు కూడా. ఇపుడదే మంత్రికి సమస్యగా మారి అవమానానికి దారితీసింది.

ఇంతకీ విషయం ఏమిటంటే, కేంద్ర బడ్జెట్ నేపధ్యంలో పార్లమెంటుతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోడిని లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు, టిడిపి నేతలు కొద్ది రోజులుగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే కదా?  చంద్రబాబుకు కౌంటర్ గా పలువురు బిజెపి నేతలు మాట్లాడుతున్నా కామినేని మాత్రం ఒక్కమాట కూడా మాట్లాడలేదు. బిజెపి ఎంఎల్ఏగా ఉంటూ చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యునిగా ఉన్న కామినేని ప్రధానికి మద్దతుగా మాట్లాడకపోవటాన్ని పలువురు తప్పుపడుతున్నారు.  

ఈ నేపధ్యంలోనే ఆదివారం విజయవాడలో బిజెపి నేతల కీలక సమావేశం జరిగింది. ప్రధానికి మద్దతుగా ఏం మాట్లాడాలి? చంద్రబాబు, టిడిపి నేతలకు ఎలా కౌంటర్ ఇవ్వాలన్న అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. నేతల మధ్య చర్చలు జరుగుతుండగానే  పలువురు కామినేని వ్యవహారశైలిని తప్పపట్టారట. దాంతో కామినేనికి కోపం వచ్చి వారికి రివర్స్ మాట్లాడారట.

దాంతో రెచ్చిపోయిన నేతలు కొందరు కామినేనిపై విరుచుకుపడ్డారట. కామినేని అసలు బిజెపి సభ్యుడా లేక టిడిపి సభ్యుడా ముందు చెప్పాలంటూ నిలదీశారట. చంద్రబాబు స్వయంగా ప్రదానిని విమర్శిస్తున్నా మంత్రిగా ఉంటూ ప్రధానికి మద్దతుగా మాట్లాడకపోవటాన్ని తప్పుపట్టారు. దాన్ని కామినేని జీర్ణించుకోలేక వారితో వాగ్వాదానికి దిగారు. అసలే కామినేనంటే మంటగా ఉన్న నేతలు ఒక్కటై మంత్రిపై విరుచుకుపడ్డారట. దాంతో బిత్తరపోయిన కామినేని ఏం సమాధానం చెప్పాలో అర్దంకాక తనకు అనారోగ్యంగా ఉందని చెప్పి సమావేశం నుండి బయటకు వెళ్ళిపోయారట.

 

 

 

 

 

 

click me!