వైసిపి ఎంఎల్ఏల సంచలన నిర్ణయం ?

First Published Feb 19, 2018, 9:57 AM IST
Highlights
  • ఎంపిల రాజీనామాలకు మద్దతుగా తాము కూడా రాజీనామాలు చేస్తే ఎలాగుంటుందని ఎంఎల్ఏల మధ్య చర్చలు మొదలయ్యాయి.

వైసిపి ఎంఎల్ఏలు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ సంచలన నిర్ణయం ఏమిటంటే, ప్రత్యేకహోదా సాధన డిమాండ్ తో రాజీనామా చేయనున్న ఎంపిలకు మద్దతుగా నిలబడాలని అనుకుంటున్నారు. హోదా డిమాండ్ తో ఏప్రిల్ 5వ తేదీన లోక్ సభ ఎంపిలు రాజీనామాలు చేస్తారని వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే.

ఎంపిల రాజీనామాలకు మద్దతుగా తాము కూడా రాజీనామాలు చేస్తే ఎలాగుంటుందని ఎంఎల్ఏల మధ్య చర్చలు మొదలయ్యాయి. గుంటూరు జిల్లా మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎంఎల్ఏల రాజీనామా ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. దానికి కొందరు ఎంఎల్ఏలు సానుకూలంగా స్పందించారట.

అదే విషయంపై విజయనగరం జిల్లా సాలూరు ఎంఎల్ఏ పీడిక రాజన్నదొర మాట్లాడుతూ ప్రత్యేకహోదా కోసం జగన్ ఆదేశిస్తే తన ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయటానికి సిద్ధమంటూ చేసిన ప్రకటన ఎంఎల్ఏల మూడ్ ఏంటో చెప్పకనే చెబుతోంది. ఎంపిల రాజీనామాలకు మద్దతుగా మార్చిలో మొదలవ్వబోయే బడ్జెట్ సమావేశాల తర్వాత తాము కూడా రాజీనామాలు చేస్తే బాగుంటుందంటూ చర్చలు జరుగుతున్నాయి.

రాజీనామాలు చేయబోయే రోజు అసెంబ్లీకి అందరూ హాజరై తమ రాజీనామా పత్రాలను స్పీకర్ కు అందచేయాలన్న చర్చ జరుగుతోంది. తామెందుకు ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేస్తున్నామో జగన్ వివరించిన తర్వాత రాజీనామా పత్రాలను అక్కడే ఇచ్చేసే ఉద్దేశ్యంలో ఎంఎల్ఏలున్నారు. త్వరలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల తర్వాత రాజీనామాలు చేస్తే బాగుంటుందని కొందరు ఎంఎల్ఏలు సూచిస్తున్నారు.

ప్రస్తుతం ప్రకాశం జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ తో ఈ విషయాన్ని చర్చించేందుకు ఎంఎల్ఏలు సిద్దపడుతున్నారు. ఈనెలాఖరులో జగన్ తో జరగబోయే ఎంఎల్ఏల సమావేశంలో ఎంఎల్ఏల మూకుమ్మడి రాజీనామాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

 

 

 

 

 

 

 

click me!