
అమరావతి: ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ రాజీనామా వ్యవహారమంతా పక్కా వ్యూహం ప్రకారమే నడిచినట్లు అర్థమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వ్యూహంలో భాగంగానే ఆయన రాజీనామా సమర్పించారని విశ్లేషకులు భావిస్తున్నారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు, పరకాల ప్రభాకర్ కు ఉన్న సంబంధాన్ని ఆసరా చేసుకుని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. దాంతో జగన్ కు సమాధానం చెప్పడానికి పరకాల ప్రభాకర్ తో రాజీనామా చేయించారని అంటున్నారు. నైతిక విలువలకు కట్టుబడి పరకాల ప్రభాకర్ రాజీనామా చేశారని అనిపించేలా చేయడమే చంద్రబాబు వ్యూహమని అంటున్నారు.
పరకాల రాజీనామా వార్త బయటకు వచ్చిందో లేదో, వెంటనే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజీనామాను ఆమోదించేది లేదని చెప్పారు. పరకాల రాజీనామా విషయంలో ముందస్తు కసరత్తు చేయకపోతే, చంద్రబాబు అంతరంగం ముందే తెలిసి ఉండకపోతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంత వేగంగా స్పందించేవారు కాదని అంటున్నారు.
ఆ వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం కూడా స్పందించింది. పరకాల ప్రభాకర్ రాజీనామాను ఆమోదించే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఎవరో ఆరోపణలు చేస్తే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని సీఎంవో వర్గాలు అన్నాయి.
గతంలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మలా సీతారామన్ సమర్థించగా.. విశాలాంధ్ర మహాసభ పేరిట సమైక్య ఉద్యమాన్ని పరకాల నడపలేదా అని ఓ లాజిక్ ను లాగారు. ఆ విషయాలు విపక్షాలకు తెలియవా? అని టీడీపీ ప్రశ్నిస్తున్నాయి.
జగన్ చేస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేయడానికే వ్యూహం ప్రకారం పరకాల ప్రభాకర్ రాజీనామా, ఆ తర్వాత ఆమోదించేది లేదంటూ ప్రకటనలు వెలువడ్డాయని అంటున్నారు.
జులై 4వ తేదీతో పరకాల ప్రభాకర్ పదవీ కాలం ముగుస్తుంది. ఈ స్థితిలో ఆయన రాజీనామా చేయడం ద్వారా నైతిక విలువలకు కట్టుబడినట్లు చాటుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.