టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు.. కార్యకర్తలకు ఇచ్చిన హామీలివే...

Published : Jun 28, 2024, 04:51 PM IST
టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు.. కార్యకర్తలకు ఇచ్చిన హామీలివే...

సారాంశం

‘‘టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు అధినేత చంద్రబాబుకు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు ధన్యవాదాలు. నాపై నమ్మకంతో ఎంతో గురుతర బాధ్యతను అప్పగించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పదవీ బాధ్యతలు నిర్వహిస్తా. పవిత్రమైన సంకల్పంతో నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీకి నన్ను రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం పూర్వ జన్మ సుకృతం’’ అని పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులుగా నియమితులైన పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన... తన నియామకంపై పార్టీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ అంటే బీసీలు.. బీసీలంటే టీడీపీ అని మరోసారి చంద్రబాబు రుజువు చేశారని కొనియాడారు. టీడీపీకి వెన్నెముకగా ఉండే బీసీలకు పెద్ద పీట వేస్తూ... రాష్ట్ర అధ్యక్ష పదవీ బాధ్యతలు అప్పగించడంపై హర్షం వ్యక్తం చేశారు. 


పల్లా శ్రీనివాసరావు ఇంకా ఏమన్నారంటే....

‘‘టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు అధినేత చంద్రబాబుకు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు ధన్యవాదాలు. నాపై నమ్మకంతో ఎంతో గురుతర బాధ్యతను అప్పగించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పదవీ బాధ్యతలు నిర్వహిస్తా. పవిత్రమైన సంకల్పంతో నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీకి నన్ను రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం పూర్వ జన్మ సుకృతం. చంద్రబాబు దిశానిర్ధేం చేసిన విషయాలను తూ.చ. తప్పకుండా పాటిస్తా. కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించేలా నామినేటెడ్ పదవులతో ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసి ముందు తీసుకెళ్లడమే ప్రధానమైన బాధ్యత పనిచేస్తా.’’

‘‘తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాడనికి కార్యకర్తలు ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా పనిచేశారు. వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓర్చుకుంటూ ప్రజా సమస్యలపై పోరాడారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అధినాయకుడి ఆదేశాలను ముందుకు తీసుకెళ్తూ కృషి చేసిన కార్యకర్తలను గుర్తించాల్సిన అవసరం ఉంది. అధికారంలోకి వచ్చాక పాలనా వ్యవస్థలో నిమగ్నమైన నాయకులు తమను పట్టించుకోవడం లేదన్న ఆలోచన కార్యకర్తల్లో ఉంది. అలాంటి విమర్శకు తావులేకుండా పార్టీ నాయకులును, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ.. 2029లోనూ ఇదే మెజార్టీతో గెలిచేలా కృషి చేస్తా..’’ అని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. 

‘‘రాష్ట్రంలో ఉన్న ప్రతి టీడీపీ కార్యకర్తకు తెలియజేసేది ఒక్కటే.. మేము అనుక్షణం మీతోనే ఉంటాం.. మీ బాధ్యత మాది. ఎంతోమంది కార్యకర్తలు రాష్ట్రాభివృద్ధి కోసం ఏమీ ఆశించకుండా పార్టీ కోసం వారి సమయాన్ని చంద్రబాబు సిద్ధాంతాలను, ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కృషిచేశారు. కార్యకర్తల కోసమే పదవి తీసుకున్నా.. కార్యకర్తలకు న్యాయం చేయకుంటే నా పాత్ర సక్రమంగా చేయనట్లు భావిస్తా... ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా... ఏ సమస్య ఉన్నా పార్టీ కార్యాలయానికి వస్తే తప్పకుండా పరిష్కరిస్తా. ప్రతి నాయకుడూ ఆలోచించాలి. అధికారం ఉందని ప్రజాస్వామ్యానికి విఘాతం కలింగించేలా వ్యవహరించొద్దు’’ అని స్పష్టం చేశారు.

కేసులను ఎత్తివేస్తాం...
‘‘గత ప్రభుత్వం అధికారాన్ని అపహాస్యం చేస్తూ... ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టింది. కేవలం ప్రతిపక్ష నేతలను అణగదొక్కడానికే అధికారాన్ని వినియోగించారు. అందుకే వైసీపీకి బుద్ధి చెప్పి ప్రజలు ఇంటికి పంపించారు. ఇవి దృష్టిలో పెట్టుకుని ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలి. రాజకీయ ప్రేరేపిత కేసులను మూడు నెలల్లో తీయించేస్తాం. ఎఫ్ఐఆర్ నమోదై.. కోర్టులో ఉన్న రాజకీయ ప్రేరేపిత కేసులను సంత్సరంలో తొలగించేందుకు కృషి చేస్తాం. ఎవరిపై ఎన్ని కేసులున్నాయో కార్యకర్తలు, నాయకులు పార్టీ దృష్టికి తీసుకురావాలి’’ అని పల్లా శ్రీనివాసరావు కోరారు. 
‘‘మనం వారి(వైసీపీ) లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. చట్టాలకు అనుగుణంగా అధికారం దుర్వినియోగం చేసిన వారికి బుద్ధి చెబుతాం. చంద్రబాబు కష్టం, యువ నేత లోకేశ్‌ యవగళం, కూటమి నాయకుల సహాయ సహకారాలు చూసి ప్రజలు అధికారమిచ్చారు. మనం ఈ ఐదేళ్లు అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కృషి చేయాలి. ముఖ్యంగా బలహీన వర్గాలను, వెనకబడిన వర్గాలను, అనగారిన వర్గాలను సమసమాజం వైపు నడిపించాల్సిన అవసరం ఉంది. వారికి రాజకీయ ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉంది. సామాజిక సమతుల్యతను చూసుకుని ముందుకు వెళ్దాం’’ అని పిలుపునిచ్చారు.

‘‘పార్టీ బలోపేతానికి యువ నాయకత్వాన్ని ఆహ్వానించాలి. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. మనుగడ ఉండాలంటే యువత మనతో అడుగులు వేయాలి. యువతను ఆకర్షించాలి. లోకేశ్ ఆలోచనలను గౌరవించాలి. సీనియర్ నేతలకు సముచిత స్థానం కల్పిస్తూనే యువతను ప్రోత్సహించాలి. యువ నాయకత్వం చట్టసభల గురించి తెలుసుకోవాలి. నాయకుడు సమాజ గమనాన్ని గుర్తించాలి. దాన్ని గమనాన్ని సరైన మార్గంలో పెట్టాలి. ఎన్టీఆర్ టీడీపీ పెట్టాకే బడుగు బలహీన వార్గాలకు రాజకీయ ప్రాధాన్యం దక్కింది. సమ సమాజ స్థాపన జరిగింది. ఉద్యోగ అవకాశాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, మానవ వనరుల అభివృద్ధి, భవిష్యత్ తరాల బాగుకోసం పరితపించే చంద్రబాబు ఆశయాలకనుంగా పనిచేయాలి. ఇంట్లో కూర్చుంటే సరిపోదు.. నాయకత్వం రావాలంటే అనుక్షణం ప్రజల్లో ఉండాలని సుమారు 3వేల కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలు తెలుసుకున్న నారా లోకేశ్‌ నుంచి యువత నాయకత్వ విలువలను నేర్చుకోవాలి. అప్పుడే ప్రజల ఆశీర్వాదం దొరుకుతుంది. గత దుర్మార్గపు పాలనలో చిన్నాభిన్నమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి.పోలవరంతో పాటు అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖ, రాయలసీమలను అభివృద్ధి చేసుకోవాలి. అధినాయకత్వంతో మమేకమై రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి’’ పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. 

కాగా, బీసీ నేత, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ పగ్గాలు అప్పగించడంపై బీసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అభినందనలు తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu