
మొత్తానికి చిన్నమ్మ వర్గమే విజయం సాధించింది. శశికళ వర్గంలోని పళనిస్వామినే సిఎం పీఠం వరిచింది. పళనిస్వామితో మాట్లాడిన గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వనించారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లోనే ప్రమాణం చేస్తారు. బలనిరూపణకు గవర్నర్ 15 రోజుల సమయం ఇచ్చారు. తనతో పాటు ప్రమాణస్వీకారం చేయనున్న మంత్రుల జాబితాను కూడా పళని గవర్నర్ కు అందచేసారు. గవర్నర్ నిర్ణయంతో 11 రోజుల రాజకీయ అనిశ్చితికి దాదాపు తెరపడినట్లే.
మొదటి నుండి శశికళ వర్గమే పన్నీర్ సెల్వంపై ఆధిపత్యం చలాయిస్తోంది. గవర్నర్ అడ్డుపడకపోతే చిన్నమ్మే ఎప్పుడో సిఎం అయ్యుండే వారు. అయితే, శశికళపై ప్రధానమంత్రి నరేంద్రమోడికి ఉన్న కోపం కారణంగా చిన్నమ్మ ఎంత ప్రయత్నించినా సిఎం కాలేకపోయారు. దానికితోడు పన్నీర్ ను కేంద్రం వెనుకవుండి నడిపించింది. అయితే స్వతహాగానే ఎటువంటి బలం లేని పన్నీర్ ఎంఎల్ఏల మద్దతును కూడగట్టుకోలేకపోయారు. దాంతో ఇక ఉపయోగం లేదని భావించిన కేంద్రం కూడా పళనిస్వామినే సిఎంగా అంగీకరించింది.