
పళనిస్వామికే బల నిరూపణకు అవకాశం ఇవ్వనున్నట్లు స్పష్టమవుతోంది. రాజ్ భవన్ నుండి పిలుపు వచ్చిందంటే బలనిరూపణకు ఆహ్వానించటమేని ప్రచారం ఊపందుకున్నది. పళని కూడా ఓ బృందంతో గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ను కలవటానికి బయలుదేరారు. ఇద్దరి భేటీ అనంతరం, సాయంత్రమే శాసనసభలో పళని తన బలాన్ని నిరూపించుకునే అవకాశాలున్నాయి.
తమకు 124 మంది ఎంఎల్ఏల మద్దతుంది కాబట్టి తననే బలనిరూపణకు ఆహ్వానించాలంటూ పళనిస్వామి గవర్నర్ కు ఓ లేఖ అందచేసారు. అందులో ఎంఎల్ఏల సంతకాలను గవర్నర్ సరిచూసుకున్నారు. దానికి తోడు 124 మంది ఎంఎల్ఏల మద్దతున్నట్లు ప్రభుత్వ కూడా నిర్ధారించుకున్నది. అన్నీ సానుకూలిస్తే ఒకటి రెండు రోజుల్లో శశికళ వర్గానికి చెందిన, చిన్నమ్మకు అత్యంత నమ్మకస్తుడైన పళనిస్వామే ముఖ్యమంత్రిగా నియమితులయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.
పళనిస్వామి సిఎం అయితే మరి పన్నీర్ సెల్వం పరిస్ధితి ఏమిటనే చర్చ మొదలైంది. గవర్నర్ రూపంలో కేంద్రం ఎంత మద్దతిచ్చినా పన్నీర్ తన బలాన్ని పెంచుకోలేకపోయారు. దాంతో పన్నీర్ ను పట్టుకుని ఊగితే ఎటువంటి లాభం లేకపోగా నష్టపోతామని భారతీయ జనతా పార్టీ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే గవర్నర్ పాత్రపైన, కేంద్రంపైన జాతీయస్ధాయిలో వ్యతరేక ప్రచారం జరుగుతోంది. దానికితోడో పళనిస్వామిని సిఎం కానీకుండా ఎక్కువ రోజులు ఆపలేమన్న విషయం కూడా కేంద్రానికి అర్ధమైపోయింది.
మెజారిటీ ఎంఎల్ఏల బలమున్న పళనిస్వామిని కాదని పట్టుమని 10 మంది ఎంఎల్ఏల బలం కూడా లేని పన్నీర్ ను సిఎం చేయటం సాధ్యం కాదన్న విషయం కేంద్రానికి తెలిసివచ్చింది. అందుకనే వేరే దారిలేక పళనిస్వామికి గవర్నర్ కబురుచేసారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో వీరి భేటీ జరిగే అవకాశముంది. దాని తర్వాతే బలనిరూపణపై స్పష్టత వస్తుంది.