ఇదేనా ఆదుకునే పద్ధతి: వరద బాధితులకు కాలం చెల్లిన నూనె

By Siva KodatiFirst Published Aug 25, 2019, 12:47 PM IST
Highlights

వరద బాధితుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వారికి అందించిన నిత్యావసర వస్తువుల్లో కాలం చెల్లిన నూనె ప్యాకెట్లను సరఫరా చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి

వరద బాధితుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వారికి అందించిన నిత్యావసర వస్తువుల్లో కాలం చెల్లిన నూనె ప్యాకెట్లను సరఫరా చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం లంక గ్రామాల్లోని 7,462 కుటుంబాలకు అధికారులు నిత్వావసర వస్తువులు అందజేశారు. వీటిలో బియ్యం మినహా...మిగిలిన సరుకులన్నీ నాసిరకంగానే ఉన్నాయని, పామాయిల్ ప్యాకెట్ల గడువు తీరిపోయిందని బాధితులు వాపోతున్నారు.

జనవరిలో ప్యాకింగ్ జరిగిన ఈ ప్యాకెట్లను జూలై 16 లోపే వినియోగించుకోవాలని తేదీ ముద్రించి వుంది. మండలంలోని పెసర్లంక, చింతర్లంక, ఈపూరులంక, తురకపాలెం, తోకలవానిపాలెం, మరికొన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి వుందని ప్రజలు మండిపడుతున్నారు.

దీనిపై బాధితుడొకరు మాట్లాడుతూ... వరద వచ్చిన 5 రోజుల తర్వాత అధికారులు వచ్చి సామాగ్రి అందించారు. అందులోనూ కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఇచ్చారని.. ఇలాంటి చర్యలతో తమ ఆరోగ్యంతో అధికారులు ఆడుకుంటున్నారని మండిపడ్డారు.

ఈ ఘటనపై పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ స్పందించారు. తెనాలి స్టాక్ పాయింట్ నుంచి కొల్లూరు వరద బాధితుల కోసం 7,066 నూనె ప్యాకెట్లు రేషన్ డిపోకు తరలించామని పేర్కొన్నారు.

ఈ క్రమంలో గోడౌన్‌లో నిల్వచేసిన 21 బాక్సుల్లో గల 336 కాలం చెల్లిన ప్యాకెట్లు పొరపాటున కొల్లూరు వరదబాధితులకు పంపిణీ అయ్యాయన్నారు.

గడువు దాటిన నూనె ప్యాకెట్లు ఇచ్చిన ఎంఎల్ఎస్ పాయింట్ మేనేజర్‌పై చర్యలకు ఆదేశించామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై ముగ్గురు అధికారులతో కూడిన బృందాన్ని విచారణకు ఆదేశించామని తెలిపారు. 

click me!